YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

12 వేల కోట్లకు 500 కోట్లే ఆదాయం

12 వేల కోట్లకు 500 కోట్లే ఆదాయం

12 వేల కోట్లకు 500 కోట్లే ఆదాయం
హైద్రాబాద్, మే 4
విపత్కర సమయంలో లాక్‌డౌన్‌తో పూర్తిగా  రాష్ట్రాలు పూర్తిగా ఆదాయం కోల్పోతున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించిన వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు.. అప్పుల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతా బాగున్నప్పుడు వేల కోట్ల రూపాయాలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్లాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని రకాలుగా కలిపి సగటున నెలకు రూ. 12 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే తెలంగాణకు లాక్‌డౌన్‌తో ఇప్పుడు రూ.500 కోట్లు రాలేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రధాన ఆదాయ వనరులైన మద్యం అమ్మకాలు నిలిచిపోవడం, రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం, జిఎస్‌టి రాకపోవడం, మైనింగ్ ఆదాయం లేదు, పెట్రోల్, డిజీలు వినియోగం పడిపోవడంతో ఆ ఆదాయం కూడా పడిపోయింది. దీంతో ఏప్రిల్ నెలలో రూ.4 వేల కోట్లు అప్పులు తీసుకున్నారు. రూ.892 కోట్లు పన్నుల వాటా వచ్చింది. ఈ నెల సరిపుచ్చుకున్నా… లాక్‌డౌన్ కొనసాగితే వచ్చే నెల ఎలా అనేదానిపై ఆర్థిక శాఖలో ఆందోళన నెలకొంది. దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయాల అప్పు.ఇప్పుడు ఆర్‌బిఐ నుంచి బాండ్ల అమ్మకాల ద్వారా అప్పులు తీసుకున్నప్పటికీ, వాటిని ఇప్పటికే తీసుకున్న అప్పులు వాటి వడ్డీలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆసరా పింఛన్లకే సరిపోయేలా ఉన్నాయి. సగటున రూ.2500 నుంచి రూ.3000 వేల కోట్లు అప్పులు, వడ్డీలకే పోతుంది. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఆదాయాలు పడిపోవడంతో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కూడా తగ్గిపోయింది. ఇప్పటికే లాక్ డౌన్ విధించి నెల రోజులు దాటి పోయింది. ఎప్పటి వరకు కొనసాగిస్తారో స్పష్టత లేదు. దీంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి నానాటికీ దిగజారుతోంది. పరిశ్రమలు తెరిపించి పన్నులు రాబట్టుకుందామన్నా కుదరడం లేదు. దీంతో ప్రభుత్వానికి ఒవర్ డ్రాప్ట్, రుణాలు తీసుకోవడం మినహా అన్ని దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది.తెలంగాణ ప్రభుత్వం మూలధన పెట్టుబడి కోసమే అప్పులు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర నిర్వహణ కోసం ఆ నిధులను వినియోగించుకుంటే భవిష్యత్‌లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, పథకాల అమలు ఎలా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. తెలంగాణతో పాటు ఎపి, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిస్సా ప్రభుత్వాలు ఖజానా నిండుకోవడంతో ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాయి. మిగతా రాష్ట్రాలు కూడా అదే బాటలో ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాలకు ఆర్థిక చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రానికి అనేక సూచనలు చేశారు.రాష్ట్ర అప్పులు వాయిదా వేయాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని 3.5 శాతం నుంచి 6 శాతం వరకు పెంచాలన్నారు. కనీసం వీటి ద్వారానైనా ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటుందని ప్రధాని మోడీకి వివరించిన ఇంకా ఫలితం లేదు. హెలికాప్టర్ మనీపై సూచన కూడా చేశారు. అయితే వీటి విషయంలో కేంద్రం స్పందన మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. బడా బాబుల అప్పులను మాఫీ చేస్తున్న కేంద్రం.. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంత ఇబ్బంది ఉన్నా సిఎం కెసిఆర్ మాత్రం కొన్ని విషయాల్లో వెనకడుగు వేయడం లేదు. ఆసరా పింఛన్‌లు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు నిధుల కొరత లేకుండా చూస్తున్నారు. మూడు నెలల ఆసరా పింఛన్‌లకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రూ.30 వేల కోట్లకు పైగా బ్యాంకు గ్యారంటీ పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఇచ్చారు.

Related Posts