YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు

మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు

పంచాయతీ ఎన్నికలకు  అధికారులు  రెడీ అవుతున్నారు. నగారా ఎప్పుడు మోగినా దానికి తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఎన్నికలకు కావాల్సిన బ్యాలెట్‌ పెట్టెలను బాగు చేస్తున్నారు.  గ్రామపంచాయతీ ఎన్నికలను జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 721 గ్రామపంచాయతీల పరిధిలో 6,282 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక బ్యాలెట్‌ పెట్టె ఉండాలి. దాంతోపాటు 20శాతం అదనంగా అందుబాటులో ఉంచుకోవాలి. సరిపడా అందుబాటులో లేవు. దీంతో ఈ పంచాయతీ ఎన్నికలను మూడు విడుతల్లో నిర్వహించనున్నారు. ప్రతి విడతలో రెండు వేల కంటే ఎక్కువ పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్వహించుకోవచ్చు.ఏళ్లుగా వాటిని వినియోగించకుండా ఉండటంతో అవి సక్రమంగా పనిచేయడం లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బ్యాలెట్‌ పెట్టెలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న వాటినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. పనిచేయని వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నుంచి ప్రారంభించిన బ్యాలెట్‌ పెట్టెల మరమ్మతులు పది రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారులు భావిస్తున్నారు. సకాలంలో ఈ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడానికి డీపీవోతోపాటు ఇద్దరు అధికారులను అక్కడ నియమించారు. ప్రస్తుతం 4,583 బ్యాలెట్‌ పెట్టెలు ఉన్నాయి. వాటిలో 3,603 బ్యాలెట్‌ పెట్టెలు కర్ణాటక రాష్ట్రంలోని యాద్గీర్‌, రాయచూర్‌ జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్నారు. వీటితోపాటు పాలమూరు జిల్లాలో 980 బ్యాలెట్‌ పెట్టెలున్నాయి. వీటన్నింటికీ మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి బ్యాలెట్‌ పెట్టెను క్షుణ్నంగా పరిశీలించాకే సరిచేస్తున్నారు. దాని కోసం 8 మంది నిపుణులను నియమించారు. ఉదయం నుంచి సాయింత్రం వరకు వారంతా బ్యాలెట్‌ పెట్టెలను సరిచేస్తున్నారు.మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని న్యూగంజ్‌లో ఉన్న వ్యవసాయ మార్కెట్‌ గోదాంలో నిల్వ ఉంచిన బ్యాలెట్‌ పెట్టెలను బయటకు తీసి దుమ్ము దులుపుతున్నారు. అయిదేళ్లకోసారి ఈ బ్యాలెట్‌ పెట్టెలను స్థానిక సంస్థల ఎన్నికల్లో వినియోగిస్తారు. తరవాత వాటిని ఎక్కడో ఒకచోట భద్రపరుస్తారు. మండల, జిల్లా పరిషత్తు, విధానసభ, లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో ఈవీఎంలనే వినియోగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను మాత్రమే పాత పద్ధతిలో బ్యాలెట్‌ పత్రాలతో నిర్వహిస్తున్నారు. ఈసారీ జరిగే ఎన్నికలకూ పెట్టెలను వినియోగించనున్నారు. దీంతో పంచాయతీ అధికారులు దగ్గరుండి ముందస్తుగా వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు.

Related Posts