YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ ఎంపీ కక్కుర్తి పని...?

విశాఖ ఎంపీ కక్కుర్తి పని...?

విశాఖ ఎంపీ కక్కుర్తి పని...?
విశాఖపట్టణం, మే 5,
ఆమె ఒక వైద్యురాలు. అంతకు మించి సామాజిక సేవకురాలు, ఇక గత ఏడాది వైసీపీలో ఇలా చేరి అలా టికెట్ సంపాదించి విశాఖ జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన అనకాపల్లి ఎంపీ అయిపోయారు. ఇపుడు ఆమె మరింత బాధ్యతగా ఉండాలి. కానీ ఆమె చేసిన కక్కుర్తి పనికి ఆమెతో పాటు, పార్టీ పరువు గంగలో కలసింది. రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ కావాల్సిన చౌక బియ్యాన్ని దారి మళ్ళించిన నేరానికి ఎంపీకి చెందిన ట్రస్ట్ మీద జిల్లా అధికారులు కేసు పెట్టారు, దానికి అదనం పోలీస్ కేసు. మొత్తానికి అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి తన పేరులోని సత్యాన్ని ఒక్క దెబ్బకు తుడిచేసుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కరోనా మహమ్మారి ఓ వైపు విలయతాండవం చేస్తున్న వేళ బాధ్యతగా ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధి కక్కుర్తి ఇపుడు పార్టీని కూడా ఇరకాటంలోకి నెట్టేసింది.ఎవరైన పేదలకు సాయం చేయడంలో తప్పు లేదు, పైగా ఎంపీ సత్యవతికి సొంతంగా చారిటబులు ట్రస్ట్ ఉంది. దాని ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే సొంత సొమ్ము వెచ్చించాలి. లేదా దాతలను అడిగి కూడా చేయవ‌చ్చు. ఈ రెండూ రాజమార్గాలు. కానీ అలా కాకుండా పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దారి మళ్ళింది అయిదు క్వింటాళ్ళు బియ్యాన్ని ఆమెకు చెందిన కళ్యాణ మండపానికి తరలించుకుపోవడం పెద్ద రచ్చగా ఉంది. దాంతో పాటుగా ఆమెకు చెందిన ట్రస్ట్ మీద కేసు పెట్టడంతో ఇన్నాళ్లు చేసిన సేవకు కూడా మరక అంటుంది. ప్రజలకు, పేదలకు సేవ చేయలంటే ఇలా ప్రభుత్వ బియ్యాన్ని దోచి పెట్టి చేయాలా అన్న విపక్షాల విమర్శలకు ఎంపీ సత్యవతి సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు.ఎంపీ పుట్టిన రోజున పేదలకు పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈ బియ్యాన్ని పంపిణీ చేయాలనుకున్నారుట. నిజానికి గత ఏడాది వరకూ ఆమె వైద్యురాలు మాత్రమే. ఈసారికి ప్రజలు ఇచ్చిన అతి పెద్ద పదవి ఉంది. ఎందరికో రాని అదృష్టం ఎంపీ పదవి. ఆ హోదాలో సత్యవతి ప్రజలకు గర్వంగా పుట్టిన రోజున కార్యక్రమాలు చేపట్టవచ్చు. పార్టీని కూడా జనంలోకి తీసుకుపోవచ్చు. మరి ఎందుకు ఇలా చేశారో అని పార్టీలో మిగిలిన నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అసలే వైసీపీ మీద ఆరోపణలకు రెడీగా ఉండే టీడీపీ, జనసేనలకు అడ్డంగా ఎంపీ నిర్వాకం దొరికిపోవడంతో ఇక విశాఖ రూరల్ జిల్లాలో వైసీపీ బాగా టార్గెట్ అవుతోంది.ఎంపీగా సత్యవతి పెద్దగా జనాలకు చేసింది లేదు అన్న విమర్శలు ఎటూ ఉన్నాయి. తనను ఎన్నుకున్న ప్రజల కోసం ఎంపీగా నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగడంలేదని కూడా సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. ఇవన్నీ ఇలా ఉండగానే ఎంపీగా నెగ్గిన ఏడాదిలోనే ఇలా కక్కుర్తి పడి పరువు పోగొట్టుకోవడం పట్ల వైసీపీలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి దీని మీద వైసీపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉండగనే తొలి ఏడాదే ఇలా పెద్ద మరక అంటించుకున్న ఎంపీకి వైసీపీలో రెడ్ రిమార్క్ పడిపోయిందని అంటున్నారు. ఇక జనాల్లోనూ సత్యవతి మరింత వ్యతిరేకతను సొంతం చేసుకుంటారని, ఇది పార్టీకి క్షేమం కాదని అంటున్నారు.

Related Posts