కుక్కలకు ట్రైనింగ్ ఇస్తున్న అమెరికా
న్యూయార్క్, మే 5
ఒక మనిషికి కరోనా లక్షణాలున్నయంటే చాలు.. శాంపిల్స్ సేకరించాలి. టెస్టింగ్ కిట్లు కావాలి లేదా ల్యాబ్ కి పంపించి టెస్టులు చేయాలి. రిజల్ట్ వచ్చేందుకు రెండు మూడు రోజులు వెయిట్ చేయాలి. ఇలా కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చిన వారందరికీ టెస్టులు చేయాలంటే ప్రపంచ దేశాలన్నీ కిందామీదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ ఉన్నవారిని గుర్తించేందుకు కుక్కలకు ట్రైనింగ్ ఇస్తే బెటర్ అని చెప్తున్నారు అమెరికా సైంటిస్టులు. ఇప్పటికే పేలుడు పదార్థాలు గుర్తించడం, డ్రగ్స్, నిషేధిత ఫుడ్ ఐటమ్స్, మలేరియా, కేన్సర్ వంటివాటిని కుక్కలు పసిగడుతున్నందున.. అదే కోణంలో వైరస్ ను కనిపెట్టేలా ట్రైనింగ్ ఇస్తున్నామని అంటున్నారు.మూత్రం, లాలాజలం నమూనాలలో వ్యాధిని బయటకు తీయడం ద్వారా మనుషులలో వైరస్ గుర్తించేలా ప్రస్తుతం ఎనిమిది కుక్కలకు ట్రైనింగ్ ప్రారంభించామని అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ (పెన్ వెట్) సైంటిస్టులు వెల్లడించారు. వాసన ద్వారా పసిగట్టే గుణం కుక్కలలో ఎక్కువగా ఉండటంతో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా కరోనా పాజిటివ్ ఉన్నవారు, కరోనా లేనివారి మధ్య ఉండే తేడాలను అవి గుర్తుపట్టగలవని అంటున్నారు. జులై నాటికి ట్రైనింగ్ పూర్తి చేసి ప్రయోగాలు చేస్తామని మీడియాకు వెల్లడించారు.‘‘కుక్కలు కేన్సర్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, కణితులు వంటి వివిధ వ్యాధులతో సంబంధం ఉన్న పేషెంట్లలోని వోలటైల్ ఆర్గానిక్ కంపౌండ్(VOC) లు అని పిలువబడే సమ్మేళనాలను కుక్కలు ఖచ్చితంగా గుర్తించగలవు. ఈ VOC లు మానవ రక్తం, లాలాజలం, మూత్రం లేదా శ్వాసలో ఉంటాయి. వాసనను పసిగట్టే కుక్కల్లో కరోనా ను దాని ప్రభావాన్ని గుర్తించే సామర్థ్యం తప్పకుండా ఉంటుంది. ట్రైనింగ్ ద్వారా ఆరోగ్యంగా ఉన్న మనిషికి, వైరస్ సోకిన వారికి ఉండే తేడాను అవి గుర్తించేలా చేయవచ్చు” అని పెన్ వెట్ సైంటిస్ట్ సింథియా ఒట్టో అన్నారు.