70 శాతం ట్యాక్స్ తో మద్యం
న్యూఢిల్లీ, మే 5,
లాక్‌డౌన్‌తో మూతబడ్డ మద్యం షాపులు దాదాపు నెల రోజుల తర్వాత తెరుచుకోవడంతో మద్యంప్రియులు బారులు తీరారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వైన్ షాపుల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపించాయి. పరిస్థితి మళ్లీ ఎలా ఉంటుందోననే ఆందోళనతో చాలా మంది సంచులు తీసుకొని నెల రోజులకు సరిపడా సరుకు తీసుకునేందుకు బయల్దేరడం గమనార్హం. చాలా చోట్ల సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా లిక్కర్ కోసం ఎగబడ్డారు. వారిని నియంత్రించడం పోలీసులకు తలకు మించిన భారమైంది. పలు ప్రాంతాల్లో పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్యంప్రియులు పోటెత్తడంతో విక్రయాలు సాగించలేక వ్యాపారులు తమ షాపులను మధ్యలోనే మూసేశారు.ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాలపై ట్యాక్స్‌ను అమాంతం పెంచేసింది. దేశ రాజధానిలో మద్యం విక్రయాలపై 70 శాతం పన్ను విధించనున్నట్లు స్పష్టం చేసింది. సోమవారం రాత్రి ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్రంలో మద్యం షాపులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. లిక్కర్‌పై తాజాగా విధించిన ట్యాక్స్‌ను ‘కరోనా స్పెషల్ ఫీ’గా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొంది. సోమవారం ఉదయం నుంచే ఢిల్లీలోని పలు వైన్ షాపుల వద్ద మద్యంప్రియులు కిలోమీటర్ల మేర బారులుతీరారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.