వైకాపా ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
అమరావతి మే 5,
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ను ఉల్లంఘించిన ఆరోపణలపై ఐదుగురు వైకాపా ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, నెల్లూరు జిల్లా సుల్లూరుపేట కిలివేటి సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని లు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది పారా కిశోర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది ఇంద్రనీల్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. తరువాత న్యాయస్థానం ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సదరు ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలపై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం పిటిషన్ పై వ్యాఖ్యానిస్తూ ఎవరు కూడా జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని, అంటువ్యాధులు వ్యాప్తి నిరోధక చట్టాన్ని ఉల్లంగిస్తూ ఎలాంటి జన సమూహాన్ని పోగు చేయరాదని స్పష్టం చేసింది.