వ్యాక్సిన్ టైమ్
రోమ్, మే 6
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది. మహమ్మారిని నిలువరించి, పోరులో విజయం సాధించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధం. ఈ ఆయుధం కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ముందుగా వ్యాక్సిన్‌ను ఎవరు అభివృద్ధిచేసినా అందరి లక్ష్యం ఒక్కటే కాబట్టి.. ఎవరు శుభవార్త చెబుతారనే ఆసక్తి నెలకుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ గురించి ఇటలీ శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన ఆశలు రేకిత్తిస్తోంది. తమ శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారుచేసినట్టు ఇటలీ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఎస్ఏ వెల్లడించింది. ‘టకీస్’రూపొందించిన ఈ వ్యాక్సిన్ ఎలుకలపై ప్రయోగం విజయవంతమైనట్టు తెలిపింది. మానవ కణాలపై పనిచేసే ఎలుకల్లో ప్రతినిరోధకాలను ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిచేసినట్టు పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ను రోమ్‌లోని స్పల్లాంజనీ హాస్పిటల్‌లో పరీక్షించినట్టు వివరించింది.మానవ కణాలలో కోవిడ్-19 వైరస్‌ను వ్యాక్సిన్ మొదటి ప్రయత్నంలో తటస్తం చేసిందని టకిస్ సీఈఓ లుయిగి ఆరిసిచియో పేర్కొన్నారని ఏఎన్ఎస్ఏ తెలియజేసింది. కరోనాకు వ్యాక్సిన్ తయారీలో ఇది అత్యంత అధునాతన దశ అని, ఈ వేసవి తరువాత క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని అన్నారు. వ్యాక్సిన్ ద్వారా కరోనావైరస్‌ను తటస్థీకరించడం ప్రపంచంలో ఇదే తొలిసారని, ఆ పనిని టకీస్ చేసిందని, మానవులపై కూడా ఇది పని చేస్తుందని భావిస్తున్నట్టు స్పల్లాంజనీ హాస్పిటల్ వర్గాలు వ్యాఖ్యానించాయి.ఎలుకలకు ఒక్క డోస్ ఇవ్వగానే.. ఎలుకల్లో యాంటీబాడీలు అభివృద్ధి చేసిందని, ఇది వైరస్‌ను మానవ కణాలకు సోకకుండా నిరోధించగలదని అరిసిచియో అన్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా, అంచనాలకు మించి ఉన్నాయని ఇటాలియన్ పరిశోధకులు వ్యాఖ్యానించారు. అమెరికన్ ఔషధ సంస్థ లీనియాఆర్ఎక్స్‌తో టకిస్ మరింత మమ్మురంగా పరిశోధనలు సాగించనున్నట్టు అరిసిచియో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు ఇటలీ చిగురుటాకులా వణికిన విషయం తెలిసిందే. దాదాపు 30వేల మంది ప్రాణాలు కోల్పోగా.. రెండు లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు.మరోవైపు, ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్ విశ్వవిద్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న పరిశోధకుడు జోనాథన్ గెర్షోని నేతృత్వంలోని బృందం ఇటీవల కొవిడ్ వ్యాక్సిన్ డిజైన్‌ను రూపొందించినట్టు ప్రకటించింది. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకి చెందిన శాస్త్రవేత్త ఉప్పలపాటి లక్ష్మీనరసయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇజ్రాయెల్ రూపొందిచిన డిజైన్‌కి మార్చిలోనే అమెరికా పేటెంట్ కూడా ఇచ్చింది. గెర్షోని బృందంలోనే లక్ష్మీనరసయ్య ఉన్నారు. సాధారణంగా వైరస్ నిరోధక వ్యాక్సిన్ తయారీకి రెండేళ్లు పడుతుందని, తమ బృందం దీన్ని రెండు నెలల్లోనే సాధించిందని లక్ష్మీనరసయ్య తెలిపారు.