అకాల వర్షాలు తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. చేతికి అందివస్తున్న దశలోని పంటలు నేలపాలయ్యాయి. మరికొన్ని చోట్ల కోత కోసిన పంట నీటిలో తడిసిముద్దైంది. దీంతో రైతన్నల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. అష్టకష్టాలు పడి పండించుకున్న పంట నీటిపాలవడంతో నిజామాబాద్ కర్షకులు తల్లడిల్లిపోతున్నారు. చేతికొచ్చి కొద్ది పంటను సొమ్ము చేసుకుందామనుకునేలోగా ప్రకృతి కన్నెర్ర చేసిందని వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 24గంటల విద్యుత్ అందుబాటులో ఉండడంతో ప్రధానంగా నిజాంసాగర్, శ్రీరాంసాగర్, గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లో వరి పెద్దమొత్తంలో సాగుచేశారు. విద్యుత్ అందుబాటులో ఉన్నా సాగునీరు సమృద్ధిగా లేకపోవడంతో దిగుబడి ప్రభావితమైంది. భూగర్భజలాలు అడుగంటడం, సాగునీటికి సమస్యలు రావడంతో పంట వాడిపోయింది. ఇప్పటివరకు సుమారు 10 వేల హెక్టార్లలో పంట ఎండిపోయిందని సమాచారం.
అనేక ప్రాంతాల్లో పండిస్తున్న పంటలో సగం మాత్రమే కోతకు వచ్చింది. మిగిలినది గింజ గట్టిపడే దశలో ఉంది. మరో రెండు వారాలు ఉంటే పంట మొత్తం కోతకు వచ్చి మార్కెట్‌కు తరలించుకునే అవకాశం ఉండేది. అయితే అకాల వర్షాలు, వడగళ్లు పంటలను ధ్వంసం చేశాయి. దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలకు వరి పంటే కాక మొక్కజొన్న, పసుపు, మామిడి పంటలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 22వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట ప్రభావితమైంది. ఇప్పటికే సేకరించిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. పసుపు పంట పరిస్థితీ ఇలాగే ఉంది. దాదాపు 2700 ఎకరాల్లో విస్తరించిన మామిడి పంట కోత దశకు చేరుకుంటోంది. గత రెండు నెలల క్రితం బలమైన ఈదురు గాలులకు పూత, పిందె భారీగా నేలరాలింది. ఉన్న కాయనైనా దక్కించుకుందామనుకున్నా ఆ ఆశా లేకుండాపోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.