ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది. సర్కారీ దవాఖానాలను మెరుగుపరచేందుకు కృషిచేస్తోంది. అయితే ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడిచేలా పలు సర్కారీ దవాఖానాల పరిస్థితి ఉంటోంది. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, కనీస వసతుల లేమి రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ సమస్యలు చాలదన్నట్లు అందుబాటులో ఉన్న సిబ్బంది సైతం సక్రమంగా విధులకు రాకుండా కాలం గడుపుతున్నారు. పెద్దపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ తరహా సమస్యే ప్రజలకు చికాకు పుట్టిస్తోంది. వైద్యులు సమయానికి రావడంలేదని, స్థానికంగా అందుబాటులో ఉండాల్సిన వారు దూరప్రాంతాల్లో ఉంటూ తమకు వీలైన సమయంలోనే వచ్చిపోతున్నారని చెప్తున్నారు. వైద్యులు సమయానికి అందుబాటులో ఉండకపోవడం వల్ల బాధితులకు సకాలంలో వైద్యం అందని పరిస్థితులు ఉంటున్నాయి.
పెద్దపల్లి ప్రాంతీయ ఆసుపత్రి భవిష్యత్‌లో 100 పడకల ఆస్పత్రిగా మారనుంది. ప్రతిష్టాత్మకంగా మారనున్న హాస్పిటల్‌కు కొందరు చీడపురుగుల్లా తయారయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా శవపరీక్షలకు ముప్పుతిప్పలు పెడుతున్నారని మృతదేహాన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి పరీక్ష చేసి బయటకు పంపించి ధ్రువీకరణ పత్రం ఇచ్చేవరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారని వాపోతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులకు బదులు ఎంబీబీఎస్, ఎంఎస్ ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులతో శవపరీక్షలు నిర్వహించేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఆయా శరీరభాగాలను ఫాసిక్ లేబోరేటరీ బాక్స్‌లో ఉంచి వరంగల్ కేఎంసీకి పంపిస్తారు. అయితే ఇక్కడ కూడా బంధువుల నుంచి ఎంతో కొంత పుచ్చుకోవటం వివాదాస్పదమవుతోంది. వైద్యవిభాగం ఈ విషయాలపై దృష్టి సారించి అక్రమాలకు తెరదించాలని, ఆసుపత్రిలో సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.