YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నిర్లక్ష్యంతో రక్తమోడుతున్న రహదారులు

నిర్లక్ష్యంతో రక్తమోడుతున్న రహదారులు

మద్యం సేవించి లేదా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదకరమని తెలిసినా పలువురు చెవికెక్కించుకోవడంలేదు. దీంతో వారే కాక ఇతరులనూ ప్రమాదాల్లోకి నెడుతున్నారు. ఈ తరహా రోడ్డు ప్రమాదాలే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికమవుతుండడంపై స్థానికంగా ఆందోళన వెల్లువెత్తుతోంది. ప్రజలే కాక అధికారులూ ఈ పరిణామంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోలీస్‌ శాఖతో పాటు ఇతర సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది వాహనదారులకు తరచూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా ఫలితం ఉండడంలేదు. బాధ్యులకు జరిమానాలు విధిస్తున్నా ప్రమాదాల సంఖ్య తగ్గడంలేదని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. తీరు మార్చుకోనివారి వల్లే దుర్ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదని స్పష్టంచేస్తున్నారు. మరోవైపు ప్రమాదాల నివారణలో రోడ్డు భద్రతా కమిటీ కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందని స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రాణనష్టం జరిగినప్పుడే సూచనలు ఇచ్చి పక్కకు తప్పుకుంటున్నారని అంటున్నారు. ప్రమాదాలకు నిలయంగా ఉండే గుంతలు, మలుపులను ముందస్తుగా రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే యాక్సిడెంట్లకు కొంత అడ్డుకట్టపడేదని స్థానికులు చెప్తున్నారు. అధికారులు ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా వాహన చోదకులు సెల్‌ఫోన్‌ మాట్లాడటం, మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం వంటి కారణాలతోనే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు సైతం ధృవీకరించారు. ఇలాంటి వారి వల్ల వారి భద్రతే కాక రోడ్డుపై ఉన్న ఇతరుల భద్రతా ప్రశ్నార్ధకమవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులను ఆనుకునే చెరువులు, కాలువలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడంతో అమాయకులు బలైపోతున్నారు. వాహనచోదకుల నిర్లక్ష్యం పలు కుటుంబాలని దుఃఖసాగరంలోకి నెడుతోంది. ఇప్పటికైనా ప్రజలు ఈ విషయాలు గ్రహించి జాగ్రత్తగా వాహనాలు నడపాలి. లేదంటే రహదారులు రక్తమోడుతూనే ఉంటాయి.

Related Posts