మద్యం అమ్మకాలను పూర్తిగా నిలుపుదల చేయాలి
టిడిపి మహిళా నేత తాళ్ళపాక అనురాధ
నెల్లూరు మే 6
ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి కరువు నేపథ్యంలో ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్యం అమ్మకాలను పూర్తిగా నిలుపుదల చేయాలని తెలుగుదేశం పార్టీ మహిళా తాళ్ళపాక అనురాధ డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఎంవి శేషగిరిబాబు ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రాణాలను తోడేస్తున్న సమయంలో, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని భావించిన, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సమంజసం కాదన్నారు. 43 రోజులు కరోనా వైరస్ తో పోరాడి, ప్రజాశ్రేయస్సు కోరుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు చేసిన సేవలను, కేవలం ఒక్క రోజులో నీరుగార్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే , అది కేవలం వైకాపా మాత్రమేనని ధ్వజ మెత్తారు. ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ ఆకలితో అలమటిస్తున్న, నేపథ్యంలో మద్యం దుకాణాలు తెలిసేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, మద్యం అమ్మకాలను పూర్తిస్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మద్యం అమ్మకాలను ఆపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా సభ్యురాలు కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.