తెలుగువాడు మరచిపోలేని దృశ్య కావ్య జనరంజని.. మూడు దశాబ్దాల 'జగదేకవీరుడు అతిలోకసుందరి'
బ్లాక్‌బస్టర్లు ఎన్నో వస్తాయి కానీ, జనరేషన్లు మారినా ఎవర్‌గ్రీన్‌గా ఉండే బ్లాక్‌బస్టర్ల లిస్ట్‌లో ఫస్ట్ ఉండే సినిమా 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. 1990 మే 9న అంటే సరిగ్గా 30 ఏళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా తెలుగునాట సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో వర్ణించడానికి మాటలు చాలవు. ఆ సినిమా విడుదలైన సమయంలో ఉన్నవాళ్లందరికీ అదొక మరపురాని అనుభవం. ఆ రోజుల్లో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' దృశ్యకావ్యాన్ని చూడని, చూడలేకపోయిన తెలుగువాళ్లని వేళ్లమీద లెక్కించవచ్చంటే అతిశయోక్తి కాదు. సినిమా తీసే, సినిమా చూసే విధానాన్ని మార్చిన ఈ సినిమా ఎలా పుట్టింది? అశ్వినీదత్ గారికి ఏ నాటినుంచో ఎన్టీఆర్జగదేకవీరుని కథ లాంటి ఫాంటసీ సినిమా చిరంజీవి గారితో చేయాలనీ, అదీ తను ప్రేమగా బావ అని పిలుచుకొనే రాఘవేంద్రరావు గారు మాత్రమే తీయగలరనీ గట్టి నమ్మకం ఉండేదట. 'ఆఖరి పోరాటం' తర్వాత చిరంజీవి గారితో సినిమా అనుకున్నారు దత్ గారు. ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన రచయిత, కో డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తిని రాఘవేంద్రరావు గారితో తిరుమల పంపించారు. సరిగ్గా ఇద్దరూ తిరుమలపై ఉండగా అశ్వినీదత్ మనసు తెలిసిన శ్రీనివాస చక్రవర్తి.. "దేవకన్య భూమి మీదకు వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది, అది చిరంజీవి గారికి దొరుకుతుంది" అని జస్ట్ ఊహామాత్రంగా చెప్పారు. అది రాఘవేంద్రరావు గారికి బాగా నచ్చింది. దత్ గారి కలకు దగ్గరగా ఉంది. ఆయనకీ నచ్చింది. మరి జగదేకవీరుడికి జోడీగా అతిలోకసుందరి ఎవరు? అందరి మదిలో మెదిలిన పేరు ఒక్కటే. వైజయంతీ ఆస్థాన నాయిక, వెండితెర దేవత.. శ్రీదేవి! క్రేజీ కాంబినేషన్ సెట్టయింది. దానికి తగ్గట్టు కథను తయారుచేయడానికి వైజయంతీ మూవీస్ ఆఫీసులో రచయితల కుంభమేళా ప్రారంభమైంది. యండమూరి వీరేంద్రనాథ్ గారు, జంధ్యాల గారితో మొదలై సత్యమూర్తి గారు, విజయేంద్రప్రసాద్ గారు, తమిళ రచయిత క్రేజీ మోహన్ గారు.. ఇలా ఇంతమంది రచయితల సైన్యం సిద్ధమైంది. అంతే కాదు.. చిరంజీవి గారు కూడా నెల రోజుల పాటు అక్కడకు వెళ్లి కథా చర్చల్లో పాల్గొని తన సలహాలు కూడా ఇచ్చేవారు. 'దేవకన్యను అతిలోకసుందరిగా చూపిస్తున్నప్పుడు నేను కొంచెం మాసిన గడ్డంతో సామాన్య మానవుని లుక్‌లో ఉంటేనే బాగుంటుంది, అందరూ కనెక్టవుతార'ని సలహా ఇచ్చారు. ఇంకోవైపు, బాంబేలో తన కాస్ట్యూమ్స్ తనే స్వయంగా డిజైన్ చేసుకొని కుట్టించడం మొదలుపెట్టారు శ్రీదేవి గారు.