YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కూరగాయల సాగుకు కాలనీలు!

 కూరగాయల సాగుకు కాలనీలు!

ఆదిలాబాద్‌ జిల్లాలో తరచూ కూరగాయలకు సమస్య ఏర్పడుతోంది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు స్థానికంగానే కూరగాయల సాగు విస్తృతంగా చేపట్టాలని ప్రణాళికలు వేస్తున్నా ఫలితం ఉండడంలేదు. జిల్లా ప్రజల అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దిగుమతులు సమయానికి జరగకపోయినా, ఏదైనా ఇబ్బంది తలెత్తినా కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. ధరాఘాతంతో వినియోగదారులు సతమతమవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా వ్యవసాయ విభాగం చర్యలు ప్రారంభించింది. స్థానికంగానే కూరగాయలను పండించేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. అధికారుల చర్యలు సఫలమైతే వినియోగదారులకు తక్కువ ధరతో కూరగాయలు లభించడంతో పాటు, రైతులకూ లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం జిల్లా వినియోగదారులకు సరిపడా టమాట, ఆకుకూరలు, మినహా మిగిలిన కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాయి. జిల్లాలో సాగు చేసేందుకు వీలున్న పంటలను కూడా రోజు వందల టన్నుల్లో దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి. ఈ సమస్యకు త్వరలోనే చెక్ పడనుంది. వచ్చే ఖరీఫ్‌ నుంచి కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు పంట కాలనీల ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

 

జిల్లాలో కూరగాయల సాగును 12,650 హెక్టార్లలో చేపడుతున్నారు. అయితే 7.08 లక్షల ఉన్న జిల్లా జనాభాకు తగ్గట్లుగా కూరగాయలు అందడం లేదు. జిల్లాలో సాగు విస్తీర్ణం మేరకు అన్ని కూరగాయలు కలిపి 6.04 లక్షల టన్నులు మాత్రమే పండుతున్నాయని సమాచారం. కూరగాయల అవసరం అధికంగా ఉండడంతో దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పండించిన ఉత్పత్తిలో ఎగుమతులు పోనూ జిల్లా కేంద్రంలో అమ్మేది తక్కువే అని అధికారులే అంటున్నారు. ఇక్కడ పండించని కూరగాయలతో పాటు, కొరత ఉండే ఇతర కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి రోజు దిగుమతి చేసుకోవల్సిన పరిస్థితి ఉంటోందని చెప్తున్నారు. జిల్లాలో కూరగాయల సాగు పెంచేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. అయితే జిల్లా అంతటా ఒకేసారి కూరగాయల సాగును అభివృద్ధి చేయకుండా ప్రయోగాత్మకంగా ఒక కాలనీ తీసుకున్నారు. ఆదిలాబాద్‌ కేంద్రంగా పంట కాలనీ అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో 18 మండలాలు ఉన్నా.. ఆదిలాబాద్‌ పంట కాలనీలో 8 మండలాలను తీసుకున్నారు. పట్టణంతో పాటు సమీప గ్రామాలకు చెందిన ప్రజలకు సరిపడా కూరగాయలను ఇక్కడే సాగు చేయించాలని భావిస్తున్నారు.

Related Posts