విజయవాడ,
నోరూరించే నూజివీడు రసాలు మామిడి ప్రియులను కొండెక్కిన ధరతో నిరుత్సాహ పరుస్తున్నాయి. డజను మామిడి కాయలు 300 నుండి 350 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ నాణ్యత అంతంతమాత్రంగానే ఉందని వినియోగదారులు వాపోతున్నారు. కాయలను చూసి కొనుగోలు చేద్దామని వెళ్లి వ్యాపారులు చెబుతున్న ధర చూసి వినియోగదారులు అవాక్కవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రసాల ధరలు ఆకాశాన్ని అంటడంతో సాధారణ ప్రజలకు మామిడి రసాలు అందనిద్రాక్షలా మారాయి. జిహ్వ చాపల్యంతో ధర ఎక్కువైనప్పటికీ కొద్దిమంది మాత్రం నూజివీడు రసాలు కొనుగోలు చేస్తున్నారు. మామిడి దిగుబడి ఈ ఏడాది అతి తక్కువగా ఉండటమే ధరలు పెరగటానికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు.పంచంలోని ఉష్ణ మండలాల్లో మామిడి ఒక ప్రముఖమైన ఫలజాతి. భారతదేశంలో ఇది సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం నుంచి సాగులో ఉన్నట్లు ఆధారాలు కన్పిస్తున్నాయి. ఆదిమ స్థానం ఇండో-బర్మా ప్రాంతమని భావిస్తారు. ఇది అక్కడ నుంచి తూర్పు పడమర దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రపంచంలో మామిడి సాగు అగ్రస్థానం భారతదేశానిదే. 12లక్షల హెక్టార్లలలో సాగవుతుందని ఓ అంచనా. పండ్ల ఉత్పత్తి 1.5 కోట్ల టన్నులు ఉంటుందని ఓ అంచనా. కృష్ణా, గుంటూరు, పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలు, ఖమ్మం, నల్గొండ, ప్రకాశం జిల్లాల్లో అధికం. నూజివీడు రసాలంటే నోరూరకమానదు. రసాలు రసాలు నూజివీడు రసాలు అంటూ సినిమా పాటల్లో బాణీలు సమకూర్చారంటే ఓ సారైనా జిహ్వచాపల్యం తీర్చుకోవాలని సగటు జీవి ఆశపడతారు. బంగినపల్లిది ఇదే దారి.