YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చెక్‌డ్యాంలతో ఆక్రమణల చెక్?

చెక్‌డ్యాంలతో ఆక్రమణల చెక్?

ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్ అవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలకు వెనకాడ్డంలేదు. అయితే తమ ప్రాంతంలో మాత్రం ఈ ఎఫెక్ట్ ఉండడంలేదని విజయనగంలోని చంపావతి నదీ తీర ప్రాంతవాసులు అంటున్నారు. స్థానికంగా ఇసుక అక్రమ రవాణాలో పలువురు అక్రమార్కులు మునిగితేలుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అధికారుల ఉదాసీనత కారణంగా ఈ దందాకు అడ్డుకట్టపడడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇసుక అక్రమరవాణాకు తోడు నది ఆక్రమణలకు గురైనట్లు చాలా కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా నది స్వరూపం దెబ్బతిందని అంతా అంటున్నారు. ఇదిలాఉంటే జోరుగా సాగిపోతున్న ఇసుక అక్రమ ఇసుక తవ్వకాలతో నీటి కొరత ఏర్పడుతోంది. దాదాపు 11 మండలాలకు చెందిన తాగునీటి పథకాలకు వేసవిలో నీరు అందని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండడంలేదు. నదిపై 10 చోట్ల రూ.70 కోట్లతో చెక్‌డ్యాంలు ఏర్పాటు చేయాలని కొన్ని నెలల క్రితమే నిర్ణయించారు. ఈ మేరకు ప్రణాళికలను సైతం సిద్ధం చేశారు. నదికి జరుగుతున్న నష్టంపై స్పందించి అధికారులు పరిరక్షణచర్యలు చేపట్టడంతో స్థానికులకు కొంత ఊరట లభించినట్టైంది. 

 

నదిలో నిర్మించదలచిన చెక్ డ్యాంలు సుమారు మీటరు ఎత్తు వరకూ ఉంటాయి. దీంతో నీరు నిల్వ సాధ్యమవుతుంది. ఆక్రమణలకు పెద్దగా ఆస్కారం ఉండదు. ఆక్రమణలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమనుకున్న చోట ఈ నిర్మాణాలు చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. చెక్‌డ్యాంల వల్ల మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, గుర్ల, నెల్లిమర్ల, గరివిడి, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ, చీపురుపల్లి మండలాల్లోని తాగునీటి పథకాలకు నీరు అందుతుంది. ఇవే కాక చెక్‌డ్యాంల పరిధిలోకి వచ్చే అన్ని పథకాలకు నీరు అందుతుంది. దీంతో భవిష్యత్‌లో నీటి సమస్యలకు తెరపడే అవకాశం ఉంది. చంపావతి నదిపై అడ్డుకట్టలు వేయడం ద్వారా ఇసుక అక్రమ రవాణానూ అడ్డుకునే అవకాశం ఉంటుంది. నిత్యం నీరు మీటరు ఎత్తువరకు ఉండడం వల్ల ఇసుక తవ్వకాలకు ఆస్కారం ఉండదు. దీంతో నది స్వరూపాన్ని కొంతమేరైనా కాపాడుకోవచ్చని అంతా భావిస్తున్నారు. పరిరక్షణ చర్యల పుణ్యంతో చంపావతి నిండు కుండలా మారితే తాగు నీటికే కాక సాగునీటి కొరతకూ తెరపడుతుంది.

Related Posts