YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

కరీమాబాద్‌లోని హజ్రత్‌ సయ్యద్‌ మాషూక్‌ రబ్బానీ (రహ్మతుల్లాఅలై) దర్గా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రఖ్యాతిగాంచింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటూ సాగే ఉర్పు వేడుకల కోసం ఈ దర్గా సిద్ధమవుతోంది. ఈనెల 9, 10, 11 తేదీల్లో జరిగే 462వ ఉర్సు మహోత్సవాలకు నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు సాగే మూడు రోజులూ ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. దీంతో ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను మహా నగరపాలక సంస్థ అధికారులు చూసుకున్నారు. ఈ ఏర్పాట్లన్నీ విజయవంతమగా పూర్తైనట్లు దర్గా పీఠాథిపతులు పేర్కొన్నారు. మహిమాన్విత శక్తిపీఠంగా పేరొందిన ఉర్సు దర్గాకు ఘన చరిత్ర ఉంది. వందల ఏళ్ల క్రితమే మొఘల్‌ చక్రవర్తులు, కులీకుతుబ్‌షాహీ నవాబులు ఈ దర్గాను దర్శించినట్లు ఆధారాలున్నాయి. ప్రస్తుతం సామాన్యులతో పాటూ కేంద్ర, రాష్ట్ర మంత్రుల వరకు ఎందరో దర్గాను సందర్శించి ప్రార్థనలు చేస్తున్నారు. 

 

ప్రఖ్యాత ఉర్సులో దాదాపు లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశమున్నట్లు పీఠాధిపతులు చెప్తున్నారు. ఉత్సవాల ప్రారంభంలో భాగంగా సోమవారం సందల్‌ షరీఫ్‌, గంధోత్సవం పీఠాధిపతి నవీద్‌బాబా ఇంటి నుంచి నయాగడీ మీదుగా రాత్రి ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి నయాగడీలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సుప్రసిద్ధ ఇస్లామిక్‌ పండితులతో ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించనున్నారు. 10న ఉర్సు జరుగుతుంది. 11న బదావా ఫకీర్ల విన్యాసాలతో ఉర్సు దర్గా ఉత్సవాలు ముగుస్తాయి. వైభవంగా సాగే ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. వీరందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల ఉత్సవాలలో అన్నదానం కూడా చేస్తున్నారు. ఇదిలాఉంటే వేడుకల నేపథ్యంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, తాగునీరు, విద్యుద్ధీకరణ, రోడ్ల సుందరీకరణ పనులు చురుగ్గా చేశారు. దర్గాలో భక్తుల కోసం వసతి సౌకర్యాలు కల్పించారు. ఉత్సవాలు జరిగే మూడు రోజల్లో స్థానికంగా శాంతి భద్రతలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీనికోసం పటిష్ట భద్రతాఏర్పాట్లు చేశారు.  

Related Posts