తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షాల ఏర్పాట్లు
విజయవాడ, హైద్రాబాద్, మే 7,
ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో పదవతరగతి పరీక్షలు పూర్తయ్యేవి. కానీ కరోనా మహమ్మారి వల్ల పరీక్షలు అర్థాంతరంగా వాయిదా పడ్డాయి. రెండురాష్ట్రాల్లోని పదవ తరగతి విద్యార్ధులు పరీక్షలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులకు సెలవులు ప్రకటించాయి. దీనితో మళ్ళీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు.? వారి భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్ధులను పరీక్షలు లేకుండానే డైరెక్ట్‌గా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పదో తరగతి పరీక్షల నిర్వహణపై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ సీఎం కేసీయార్ పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పచ్చజెండా ఊపేశారు. మార్చిలో మూడు పరీక్షలు నిర్వహించిన తర్వాత కరోనా భయాలతో హైకోర్టు ఆదేశాలమేరకు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంకా ఎనిమిది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మంగళవారం క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ హైకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం మిగతా 8 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలపై సీఎం మాట్లాడుతూ గతంలో ఏర్పాటుచేసిన దాదాపు 2500 పరీక్షా కేంద్రాలను అవసరమైతే 5000కు పెంచుతాం. ఇంకా అవసరమైతే 5500 చేస్తాం. భౌతిక దూరం పాటిస్తూ ఒక హాల్‌లో తక్కువ విద్యార్థులుండేలా ఏర్పాట్లు చేస్తాం. పరీక్ష గదులను పూర్తిగా శానిటైజ్ చేస్తామన్నారు. టెంత్ పరీక్ష రాసే విద్యార్థులకు మాస్కులు అందిస్తాం. దీనిపై విద్యాశాఖ మంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు. పరీక్షల నిర్వహణపై క్యాబినెట్ నిర్ణయం తీసుకొని అడ్వకేట్ జనరల్‌కు ఆదేశాలిచ్చింది. తక్షణమే కోర్టులో అప్లయ్ చేయమన్నాం. సీజే ముందు అప్లయ్ చేసి కన్సంట్ తీసుకోమన్నాం. కోర్టు కూడా పర్మిషన్ ఇస్తుందని భావిస్తున్నాం. పిల్లలు, తల్లిదండ్రులు టెన్షన్‌లో ఉన్నారు. వీరికోసం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటాం. విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేసి. పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తాం.ధనవంతుల పిల్లలుంటే వాళ్లకు స్పెషల్ కారు పాసులు కూడా ఇస్తాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎస్‌ఎస్‌సీ పరీక్షలను మే నెలలోనే పూర్తి చేస్తాం. ఎందుకంటే ఎస్‌ఎస్‌సీ ఆధారంగానే ఇతర అడ్మిషన్స్, ఇంటర్మీడియట్ చదువు ఆధారపడి ఉంటుంది అని సీఎం పేర్కొన్నారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ తో సంబంధం లేకుండా కేసీయార్ తెలంగాణలో మే 29 వరకూ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కేంద్రం విధించిన లాక్ డౌన్ ఏపీలో మే 17తో ముగియనుంది. లాక్ డౌన్ ఎత్తేసిన రెండు వారాలకు టెన్త్ పరీక్షలు ఉంటాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ దిశగా షెడ్యూల్ సిద్దం చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కరోనా ప్రభావం ఉన్న నేపధ్యంలో పరీక్షల నిర్వహణతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.ఇందులో భాగంగా పలు మార్గదర్శకాలను పాటించనుంది. గతంలో మాదిరిగా కాకుండా ఒక పరీక్ష హాలులో కేవలం 12 మంది విద్యార్ధులు మాత్రమే పరీక్ష రాసేలా చర్యలు తీసుకోబోతున్నారు. విద్యార్ధులకు మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండటంతో పాటుగా ప్రతీ బెంచ్‌కు ఒక విద్యార్ధి మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.మిగతా పరీక్షలలాగే పదవ తరగతి పరీక్షలు కూడా వుండవని భావించిన విద్యార్ధులు ఇప్పుడు మళ్లీ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇటు సీబీఎస్ఇ పదవ తరగతి పరీక్షలను రద్దుచేసింది. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి పేపర్లు దిద్దే కార్యక్రమం, స్పాట్ వాల్యుయేషన్ బుధవారం నుంచి ముమ్మరంగా చేపడతామని సీఎం తెలిపారు. రేపో ఎల్లుండో పోయే గండం కాదు. ఇది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటివరకూ కొంత ఉపాయంతో రక్షించుకున్నాం. ఇక నుంచి ఉపాయంతో మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. పదో తరగతి పరీక్షలను నిర్వహించడంతో పాటు ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేస్తాం. వచ్చే అకమిక్ ఇయర్ పదిహేను రోజులు ఆలస్యమవుతుందంతే. జూన్‌కే ఉంటుందాదా? జూలైకి పోతుందా? ఏది ఉత్తమం? ఎట్లా చేయవచ్చు? రాష్ట్రం, దేశంలో కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని షార్ట్ పీరియడ్‌లో డిక్లేర్ చేస్తాం అని ముఖ్యమంత్రి వివరించారు.