YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

చైనాకు గుడ్‌బై చెప్తున్న అమెరికా కంపెనీలు

చైనాకు గుడ్‌బై చెప్తున్న అమెరికా కంపెనీలు

చైనాకు గుడ్‌బై చెప్తున్న అమెరికా కంపెనీలు
హైదరాబాద్ మే 7
అమెరికా చైనా అంటే మండిపడుతున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా కంప తెచ్చిపెట్టింది చైనాయేనని విమర్శల ధాటి పెంచుతున్నారు. చైనాను నమ్మొద్దనే ధోరణి అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్నది. ముఖ్యంగా వైద్యరంగంలో చైనాతో దోస్తీ పెట్టుకోగూడదని అమెరికా భావిస్తున్నది. ఇది భారత్‌కు ఓ అవకాశంగా పరిణమిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా కల్లోలంలో భారత్, అమెరికా మరింత దగ్గరయ్యాయి. ట్రంప్ కోరిన మలేరియా మందు బోలెడు ఇవ్వడం ద్వారా ఇండియా తన పలుకుబడిని గణనీయంగా పెంచుకున్నది. ట్రంప్ సంబరపడిపోయి ఇండియాను తెగ మెచ్చుకున్నారు కూడా. చైనా మీద మొఖం మొత్తిన అమెరికా కంపెనీలను రారమ్మని పిలిచేందుకు ఇంతకన్నా మంచి తరుణం ఏముంటుంది? అందుకే గత ఏప్రిల్ నెలలో ప్రభుత్వం వెయ్యికి పైగా కంపెనీలతో సంప్రదింపులు జరిపింది. విదేశాల్లోని మన రాయబార కార్యాలయాలు ఈ విషయంలో అనుసంధాన కర్తలుగా పనిచేస్తున్నాయి. చైనా నుంచి ఇండియాకు రావాలని అనుకునేవారికి బోలెడు రాయితీలూ ప్రతిపాదించింది. భారత్ ప్రధానంగా వైద్యపరికరాలు, ఆహారశుద్ధి, జౌళి, చర్మఉత్పత్తులు, ఆటోమోబైల్ విడిభాగాల పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఆరోగ్యరంగ ఉత్పత్తులు, పరికరాల కంపెనీలతో చర్చలు సానుకూలంగా సాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చైనా నుంచి యూనిట్లను వేరేచోటికి మార్చేయాలని చూస్తున్న మెడ్‌ట్రానిక్ పీఎల్సీ, అబాట్ లేబరేటరీస్ ఇండియా వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. మెడ్‌ట్రానిక్, అబాట్.. రెండు కంపెనీలకు ప్రస్తుతం భారత్‌లో యూనిట్లు ఉన్నాయి. దీంతో చైనా నుంచి యూనిట్లను భారత్‌కు తరలించడం సులభం అవుతుందని ఓ అధికారి అన్నారు. భారత ఆర్థిక రాజధాని అయిన ముంబై నుంచే వాటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పెద్దపెద్ద హాస్పిటల్ గ్రూపులతో అవి కలిసి పనిచేస్తున్నాయి. చైనాపై ట్రంప్ విమర్శల వల్ల ప్రపంచ వాణిజ్యంలో డ్రాగన్ పరిస్థితి ఇరకాటంలో పడుతుంది. కేవలం అమెరికా మాత్రమే కాకుండా ఇతర దేశాలూ తమ కంపెనీలను చైనా నుంచి తరలించే ఆలోచనకు వస్తున్నాయి. చైనా నుంచి కంపెనీలను వేరే చోటికి మార్చేందుకు జపాన్ ఈ సరికే 2.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16 వేల కోట్లు) కేటాయించింది. చైనా సరఫరాదారులపై ఆధారపడడం తగ్గించుకోవాలని యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు భావిస్తున్నాయి. చైనా నుంచి మొఖం తిప్పుకోవాలనుకునే కంపెనీల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవం. సరిగ్గా ఇక్కడే భారత్‌కు కలిసివస్తుంది. భారత్‌లో భూమి సేకరణ సులభం. అందుబాటు వ్యయంలో సుశిక్షితులైన శ్రామికశక్తి లభిస్తుంది. మొత్తంగా చూస్తే చైనా కన్నా కొంచెం వ్యయం ఎక్కువైనా అమెరికా, జపాన్ తదితర దేశాల కంపెనీలకు సొంతగడ్డకు తరలివెళ్లడం కన్నా ఇదే గిట్టుబాటుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విషయంలో భారత్ కు దరిదాపుల్లోకి వచ్చే మరొక దేశం ఏదైనా ఉందంటే అది వియత్నాం. కానీ భారత్ కల్పించే స్థాయిలో రాయితీలు వియత్నాం కల్పించగలదా అనేది ప్రశ్న. వియత్నాం కన్నా భారత్ ఆకర్షణ కొంచెం ఎక్కువే ఉంటుంది. కంపెనీలకు ప్రధానమైన అడ్డంకిగా ఉన్న కార్మిక చట్టాలను మార్చే విషయాన్ని ఇండియా పరిశీలించేందుకు సంసిద్ధంగా ఉంది. డిజిటల్ లావాదేవీలపై ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పన్నులను వాయిదా వేయాలన్న విజ్ఞాపననూ భారత్ సానుకూలంగానే పరిశీలిస్తున్నది. మొత్తంమీద చైనా నుంచి అడ్డా ఎత్తేయాలనుకునే కంపెనీలకు భారత్ మంచి గమ్యస్థానంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

Related Posts