పౌల్ట్రీ రంగంపై మంత్రి తలసాని సమీక్ష
హైదరాబాద్ మే 7
పౌల్ట్రీ రంగానికి క్వింటాలు మక్కలను 1525 రూపాయలు చొప్పున సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో పౌల్ట్రీ రంగ అభివృద్ధి కోసం మంత్రి అద్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో పౌల్ట్రీ రంగ ప్రతినిధులకు మంత్రి వివరించారు. ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, పౌల్ట్రీ రంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇదే ధరపై పౌల్ట్రీ రంగానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను సరఫరా చేయనున్నట్లు వివరించారు. రవాణా ఖర్చులను పౌల్ట్రీ నిర్వాహకులే భరిస్తారని తెలిపారు. కరోనా కారణంగా నష్టపోయే పరిస్థితులలో ఉన్న పౌల్ట్రీ రంగం ముఖ్యమంత్రి, ప్రభుత్వ చొరవతో పుంజుకొని సాధారణ స్థితికి చేరుకుందన్నారు. పౌల్ట్రీ రంగాన్ని అగ్రస్థానం లో నిలపాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ లాక్ డౌన్ ముగిసిన అనంతరం పలు రాష్ట్రాలలో పర్యటించి అక్కడ అమలవుతున్న విధానాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఉత్తమమైన పాలసీని రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని ఆయన వివరించారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని ఆయన వివరించారు. లాక్ డౌన్ వంటి క్లిష్ట పరిస్థితుల లో సైతం పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పౌల్ట్రీ రంగానికి ఎంతో దైర్యం, భరోసాను కల్పించిందని గుర్తుచేశారు. చికెన్, గ్రుడ్లు తినాలని ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించి ఆపదలో ఉన్న పౌల్ట్రీ రంగానికి అండగా నిలిచిందని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కోళ్ళ దాణా కోసం ఉపయోగించే మక్కలను భవిష్యత్ లో ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా సేకరించి పౌల్ట్రీ పరిశ్రమకు సరఫరా చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. ప్రస్తుతం ఒక కోటి 22 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు పండుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ఒక కోటి 35 లక్షల ఎకరాలకు పంటల సాగు విస్తీర్ణం పెరగనుందని వివరించారు. రైతులు పండించే పంటల మార్కెటింగ్ పై ప్రభుత్వం ముందస్తు ప్రణాలికలను సిద్దం చేస్తుందని పేర్కొన్నారు. ఏ రంగానికైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడినా ప్రభుత్వం, అధికారులు సకాలంలో స్పందిస్తు ఆరంగ పురోభివ్రుద్దికి కృషి చేస్తుందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అద్యక్షులు ప్రదీప్ కుమార్, ప్రతినిధులు జె.రాంరెడ్డి, వి.భాస్కర్ రావు, కె.మోహన్ రెడ్డి, స్నేహ చికెన్ రాంరెడ్డి, ఎన్ఈసీసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ సభ్యులు రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.