YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

నీటి కుంటలతో ప్రయోజనాలు మెండు

నీటి కుంటలతో ప్రయోజనాలు మెండు

వ్యవసాయక్షేత్రాలకు సమృద్ధిగా నీరు అందించాలని ప్రభుత్వం కృషిచేస్తోంది. పలు ప్రాజెక్టులతో సాగునీటికి కొరత లేకుండా చూడాలని యత్నిస్తోంది. అయినప్పటికీ ఈ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరని పరిస్థితులు ఉంటున్నాయి. వేసవి వస్తే భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయి. దీంతో సాగు నీటి కష్టాలను జయించేందుకు కరీంనగర్ ప్రాంతంలోని పలువురు రైతులు నీటి కుంటలను ఆశ్రయిస్తున్నారు. తమ పొలాల్లో ఈ తరహా కుంటలను తవ్వించుకుని నీటి సమస్యను అధిగమిస్తున్నారు. నీటి కుంటల ద్వారా రామడుగు మండలానికి చెందిన పలువురు రైతులు సాగునీరు ఇబ్బందులను జయించారు. కుంటల ఏర్పాటుతో  సాగునీటి వెతలు గణనీయంగా తొలగిపోయాయి. నీటి కుంట ఫలితాలను తెలుసుకున్న ఓ రైతు తొలిగా తన పొలంలో తవ్వించుకున్నారు. చిరకాలంలోనే భూగర్భజల మట్టం పెరిగి నీటి కొరత తీరడంతో ఇతర రైతులు కూడా తమ పొలాల్లో కుంటలు తవ్వించుకున్నారు. రైతన్నలకు ప్రయోజనకరంగా ఉంటుందనే యోచనతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పైసా ఖర్చు లేకుండా పొలాల్లో నీటి కుంటల నిర్మాణం పొందుపరిచింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రైతులు వర్షం నీటిని ఒడిసిపట్టి పొలాలకు నీటి తడులు అందించుకుంటున్నారు. 

 

నీటి కుంటలతో సాగునీరు ఆశించినంతగా ఉండడంతో రైతన్నలు సిరుల పంటలు పండిస్తున్నారు. దీంతోపాటు మేకలు, గొర్రెలు, పశువులు, గేదెలు నీటి కోసం దూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించడంతో రైతులు, కూలీలు లాభపడుతున్నారు. కుంటల తవ్వకం ద్వారా స్థానికులు ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేకుండా పోయింది.  సాగు నిమిత్తం పొలంలోనే నీటి కుంటలు తవ్వుకుంటే రైతులకు గణనీయమైన మేలు చేకూరుతుంది. పొలం విస్తీర్ణం ఆధారంగా కుంటను నిర్మించుకుంటే లాభాలు అధికంగా ఉంటాయని వ్యవసాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కుంటల నిర్మాణానికి రైతులు పెద్దగా ఖర్చు చేయాల్సిన పని ఉండదని అంటున్నారు. ప్రభుత్వమే రూ.40 వేలు మొదలుకొని రూ.2.50 లక్షల వరకు కూలీలకు చెల్లిస్తుందని చెప్తున్నారు.  

Related Posts