సీబీఎస్‌ఈ సిలబస్ కుదింపు!
అమరావతి మే 7
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ను కుదించే దిశగా అడుగులు పడుతున్నాయి. కోవిడ్–19, లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో 2019–20 విద్యా సంవత్సరం క్యాలెండర్ అమలు అస్తవ్యస్తంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేస్తున్న పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు ముగియకపోవడం, 12వ తరగతి (ఇంటర్మీడియెట్ ) పరీక్షలు నిర్వహించలేకపోవడంతో ఈ ప్రభావం వచ్చే విద్యా సంవత్సరంపై పడుతోంది. ఈ దృష్ట్యా కొత్త విద్యా సంవత్సరంలో తరగతుల నిర్వహణ ఆలస్యం కానుందని.. దీనికి అనుగుణంగా సిలబస్‌ను కొంతమేర కుదించే యోచనలో ఉన్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. విద్యార్థులతో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ఇంటరాక్షన్ కార్యక్రమం రెండో రోజైన బుధవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.