కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
విజయవాడ, మే 7,
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ ప్రమాదంపై స్పందించిన హైకోర్టు.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. గురువారం అత్యవసరంగా ధర్మాసనం విచారణ చేపట్టింది. అధిక జనాభా ఉన్న ప్రాంతంలో ఇటువంటి పరిశ్రమ ఎలా ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఘటనపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది.. వచ్చే వారానికి విచారణ వాయిదా వేసింది.ఇటు విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మీడియా కథనాల ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. విశాఖలో జరిగిన ఘటనపై ప్రభుత్వం ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. బాధితులకు ఎలాంటి వైద్య చికత్స అందిస్తున్నారు. పునరావాసాలు కల్పించారా లేదా అన్న విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సీఎస్‌ను కమిషన్, డీజీపీని ఆదేశించింది.గురువారం వేకువజామున విశాఖ ఆర్ ఆర్ వెంకటాపురం సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకయ్యింది. దీంతో స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.. రోడ్లపైనే చాలామంది కుప్పకూలిపోయారు. చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారు. స్థానిక యువకులు, పోలీసులు బాధితుల్ని ఆస్పత్రులకు తరలించారు. ఇప్పటి వరకు 10మంది చనిపోగా.. వందలాదిమంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు.