కార్పొరేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ల బేరం
వరంగల్, మే 8
కష్టకాలంలో కార్పొరేట్ విద్యాసంస్థలు కక్కుర్తి పడుతున్నాయి. పైసలు కట్టనిదే పిల్లలకు చదువులు చెప్పేది లేదని మంకు పట్టు పడుతున్నాయి. రకరకాల షరతులు పెట్టి ముక్కు పిండి వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇది ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల దాహానికి నిదర్శనం. ఆన్‌లైన్ తరగతులు వినాలంటే ఫీజు కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌లోనూ మానవత్వాన్ని ప్రదర్శించడం లేదు. వ్యాపార దృష్టితోనే ఆలోచించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.కరోనా లాక్‌డౌన్‌లో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఆన్‌లైన్ తరగతులపైనే చర్చ జరుగుతున్నది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో అందరి దృష్టి ఆన్‌లైన్ తరగతులపైనే పడింది. యూజీసీ, ఏఐసీటీఈ మొదలుకుని నిపుణులు, విద్యావేత్తల వరకు ఆన్‌లైన్ తరగతులు చేపట్టాలని చెప్తున్నారు. భవిష్యత్తు డిజిటల్ యుగానిదే అని అంటున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యార్థులకూ ఆయా విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులను ఇప్పుడు కూడా నిర్వహిస్తున్నాయి. అయితే కరోనా లాక్‌డౌన్‌ను ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. లాభాలపైనే దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగానే ఆన్‌లైన్ తరగతుల దందాకు తెరతీశాయి. కనీస మానవత్వాన్ని యాజమాన్యాలు ప్రదర్శించడం లేదు. ఫీజు కడితేనే ఆన్‌లైన్ తరగతులు వినేందుకు అవకాశం కల్పిస్తామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఫీజు చెల్లించకపోతే పాఠాలు వినే అవకాశం కోల్పోతారని బెదిరిస్తున్నాయి. టీ వ్యాలెట్, గూగుల్ పే, ఫోన్ పే, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి. యాజమాన్యాల తీరుతో తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. పిల్లలు బాగా చదవాలనీ, పాఠాలు బాగా వినాలనీ, మార్కులు బాగా తెచ్చుకోవాలనీ తల్లిదండ్రులు భావిస్తున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఖర్చు చేసేందుకు వెనుకాడరు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటారు. దీన్ని అదనుగా భావించి ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వ్యాపార బుద్ధిని ప్రదర్శిస్తున్నాయి. ఆర్థికంగా స్తోమత ఉన్న తల్లిదండ్రులు ఫీజు కట్టేందుకు ముందుకొస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల్లో ప్రభుత్వం కోత విధించింది. ఉపాధి కోల్పోయి, బతకడానికే ఇబ్బంది పడుతున్న వారు ఫీజు కట్టాలని ఒత్తిడి తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఫీజులు అడగడం ఏంటని?ప్రశ్నిస్తున్నారు. ఫీజులు కట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తేవొద్దని రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలను ఆదేశించింది. అయినా ఆన్‌లైన్ తరగతుల పేరుతో ఫీజుల వసూలుకు తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. లాక్‌డౌన్ కాలంలో ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫీజు కట్టాలని ఒత్తిడి చేయడం సరైంది కాదని చెప్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఫీజును వసూలు చేయాలని వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.