నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున స్థబ్దత
హైద్రాబాద్, మే 8
కరోనా దెబ్బకు నిర్మాణరంగం కుదేలైంది. గత ఆర్నెళ్లుగా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున స్థబ్దత ఏర్పడింది. డిమాండ్‌కు మించి నిర్మాణాలు జరగడం, ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక విలవిల్లాడుతున్న తరుణంలో గోరు చుట్టపై రోకలి పోటులా కరోనా పంజా విసిరింది. భవన నిర్మాణరంగమే కాకుండా ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో అనేక ప్రాజెక్ట్‌లు ఆగిపోయినాయి. దీనికి తోడు ఈ రంగంలో పని చేస్తున్న లక్షలాది మంది వలస కార్మికులు కరోనా భయంతో తమ స్వస్థలాలకు వెళ్లడంతో మరో ఆర్నెళ్ల వరకు రాష్ట్రంలో అశించిన వృద్ధిని అందుకోలేదని నిపుణులు అంటున్నారు.నిర్మాణరంగంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది కార్మికులున్నారు. ఇందులో 8 లక్షల మంది వరకు బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఓడిషా, పశ్చిమబంగా, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారే. ఇటుక బట్టీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సీలింగ్ వర్కర్లు, మేస్త్రీలు, మార్బుల్, గ్రానైట్, టైల్స్ తదితర రంగాల్లో పని చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు, ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో నడుస్తున్న ప్రాజెక్టులు తమ నిర్మాణాలను ఆపడంతో వీరంతా గత రెండు నెలలుగా పనులు లేక, తినేందుకు తిండిలేక అష్ట కష్టాలు పడ్డారు. దీంతో గత్యంతరం లేక ఇప్పటికే కొంత మంది కాలి నడకన స్వగ్రామాలకు వెళ్లారు. తాజాగా కేంద్రం వారిని స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించడం, ప్రత్యేక రైళ్లను నడుపుతుండడంతో రాష్ట్రంలో ఈ రంగంలో పని చేస్తున్న వలస కార్మికులు ఒక్కరు కూడా ఉండే పరిస్థితిలేదు. డబ్బులు రేపు సంపాదించుకోవచ్చు బతికుంటే బలిసాకు తినొచ్చని అనుమతిచ్చిందే తడవుగా కార్మికులు సొంతూర్లకు పయనమవుతున్నారు. ఈ ప్రభావం తెలంగాణ నిర్మాణ రంగంపై రాబోయే ఆర్నెళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన వారు మార్బుల్, గ్రానైట్, టైల్స్ వేయడం, ఓడిషాకు చెందిన వారు ఇటుక బట్టీలు, రైస్ మిల్లుల్లో ఇలా తాము చేస్తున్న పనుల్లో ప్రత్యేకమైన నైపుణ్యం కల్గిన వారు కావడం గమనార్హం. లాక్ డౌన్ ఎత్తివేసి పనులు ప్రారంభమైనా వీరి లోటును కచ్చితంగా కనిపించనుందని భావిస్తున్నారు..లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారి గురించి పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. తెల్ల రేషన్ కార్డుదారులతో పాటు వలస కార్మికులందరికి 12 కిలోల ఉచిత బియ్యం, కుటుంబానికి రూ. 500 చెల్లింపు ఆచరణలో విఫలమైంది. రాష్ట్రంలో కేవలం 40 శాతం మందికి కూడా అందలేని తెలుస్తున్నది. అలాగే వీరుంటున్న ప్రాంతాలు, ప్రత్యేక క్యాంపుల్లో అన్ని సహాయ చర్యలు చేపట్టాలని చివరికి రాష్ట్ర హైకోర్టు సైతం ఆదేశించింది. అయినా వలస కార్మికుల సౌకర్యాలపై ప్రభుత్వం పెద్దగా పట్టించుకోక పోవడం గమనార్హం. ప్రాంతం గాని ప్రాంతం నుంచి కట్టు బట్టలతో వలస వచ్చి ఇక్కడి అభివృద్ధిలో తాము భాగస్వామ్యమైతే విపత్కర పరిస్థితుల్లో సర్కార్ తమను పట్టించుకోలేదనే భావన వారిలో నాటుకుపోయింది. దాంతో ఇప్పడిప్పుడే తిరిగి రాకపోవచ్చని భావిస్తున్నారు.వలస కార్మికులను ఆదుకోడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశంలో దాదాపు 14 కోట్ల మంది కార్మికులు వివిధ వృత్తుల్లో అనేక రాష్ట్రాలకు వలస పోతుంటారు. వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపించడం, లేదా ఉన్న చోటే అన్ని సౌకర్యాలు కల్పించడం చేసిన తర్వాతే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోకుండా ఉన్న పళంగా ప్రకటించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఇదే నిర్లక్ష్యంతో నోట్లను రద్దు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ సర్కార్ నాశనం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం వారిని ఆదుకోవడంలో శ్రద్ద చూపలేదు. వారికి ప్రకటించిన ప్యాకేజీ కేవలం కొంత మందికి మాత్రమే అందింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా తెలంగాణలో వారి లోటు నిర్మాణరంగంపై కచ్చితంగా ఉంటుంది.