మార్కెట్ ను ముంచెత్తుతున్న కార్బైడ్
మెదక్, మే 8,
నిషేధం ఉన్నా.. హానికరమైన రసాయనాలు ఉపయోగించి పండ్లు మగ్గపెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అటువంటి వారిపై కేసులు నమోదు చేయనున్నారు. కొందరు పండ్ల వ్యాపారులు, పండ్లు సాగుచేసే వారు అనారోగ్యానికి గురిచేసే కాల్షియం కార్భైడ్, ఇథెఫోన్ (చైనా పౌడర్) వంటివి ఉపయోగించి కృతిమంగా పండ్లను మగ్గపెడుతున్నారని రాష్ట్ర అగ్రోస్ సంస్థ గుర్తించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డి మంగళవారం రాష్ట్ర డిజిపికి, ఫుడ్ సేఫ్టి కమిషనర్‌కు, ఉద్యాన శాఖకు లేఖ రాశారు. క్షేత్రస్థాయిలోని అధికారులు తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ప్రధానంగా మామిడి, బత్తాయి, సపోటా, అరటి కాయలు మగ్గపెడుతున్నట్లు పేర్కొన్నారు.ఇటీవల కాలంలో టమాట కూడా పండుగా మారేందుకు రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించినట్లు లేఖలో వివరించారు. కార్భైడ్, ఇథెఫోన్ పౌడర్ నిషేధమని మార్కెట్‌లో వీటి లభ్యత లేకుండా చూడాలన్నారు. మనిషి ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం కాని రైఫినింగ్ పద్ధతులను ప్రోత్సాహించాలని సూచించారు. వాస్తవానికి వైద్యులు కూడా సంపూర్ణ ఆరోగ్యానికి పండ్లు తీసుకోవాలని సూచిస్తారు. సులువుగా జీర్ణమవుతాయని, పోషకాలు పుష్కలంగా లభిస్తాయని కాస్త ఖరీదైనా రోగులు తప్పనిసరిగా తింటారు. పైగా వేసవిలో పండ్ల వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో కరోనా వ్యాప్తితో రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు బత్తాయిలు, ఇతర పండ్లు తినాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా సూచించడంతో వినియోగం విపరీతంగా పెరిగింది.నెల రోజులుగా పండ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే సహజంగా పండిన పండ్లు ఆరోగ్యకరమని, కానీ మార్కెట్‌లో లభించే చాలా పండ్లను రసాయనాలతో మాగబెట్టిన పండ్లు తింటే విషం తిన్నట్లే అని అధికారులు వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమంగా హానికరమైన రసాయనాలు, పౌడర్లు వినియోగించి పండ్లు మగ్గబెడితే కఠిన చర్య లు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది.సహజ సిద్ధంగా పండ్లుగా మార్చాలంటే కనీసం 4 రోజులు పడుతుంది. తొందరగా జేబులు నింపుకునేందుకు ఒక్కరోజులోనే మాగేలా విష రసాయనాలను వ్యాపారులు వినియోగిస్తున్నారు. వెలుతురు, గాలి లేని గదుల్లో కాయల్ని కుప్పగా పోసి ఈ మందులను స్ప్రే చేస్తారు. ఇలా చేస్తే ఒక్క రోజులో కాయలు మంచి రుంగులో పండ్లుగా మారుతాయి. ఈ ప్రక్రియలో పండ్లన్నీ విషతుల్యమౌతాయి. ఆహార కల్తీ నియంత్రణ చట్టం 1965, నిబంధన 44 ప్రకారం ఆహార పదార్థాలను కృత్రిమంగా పండించడం నేరం. జిల్లా స్థాయిలో ఆహార భద్రత, కల్తీ నియంత్రణ శాఖ స్థానికంగా మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు ఈ చట్టాన్ని అమలు చే యాలి. కానీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పండ్ల వ్యాపారులపై నిరంత ర నిఘా వేస్తే తప్ప వ్యాపారుల తీరులో మార్పు రాదంటున్నారు.హానికర రసాయనాలతో మగ్గపెట్టిన పండ్ల ను తింటే క్యాన్సర్ సోకుతుంది. ఛాతిలో నొప్పి, ఉదర సమస్యలు, కాలేయం దెబ్బతింటుంది. జీర్ణశక్తి తగ్గిపోతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. చర్మ వ్యాధులు, కంటిచూపు కోల్పోవడం వంటి ప్రమాదా లు సంభవిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పక్వానికి వచ్చిన కాయల్ని చెట్టు నుంచి కోసి కుప్పగా పోసేవారు. వాటిపై వరిగడ్డి కప్పి వారం పది రోజులు మగ్గనిచ్చేవారు. ఈ పద్ధతిలో పండ్లుగా మారిన కాయలు ఆరోగ్యకరమైనవి. రెండో పద్ధతిలో ఇథలిన్ గ్యాస్ ద్వా రా కాయల్ని పండ్లుగా మారుస్తున్నారు. దీని వల్ల పెద్దగా అనారోగ్య సమస్యలు రావు. నాలుగు రోజుల్లో కాయలు పండ్లవుతాయి