YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ నిర్ణయం... ప్రతిపక్షాలు మౌనం

జగన్ నిర్ణయం... ప్రతిపక్షాలు మౌనం

జగన్ నిర్ణయం... ప్రతిపక్షాలు మౌనం
విజయవాడ, మే 8
విశాఖ‌ప‌ట్నం గ్యాస్ లీక్ దుర్ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. దేశంలో భోపాల్ గ్యాస్ లీక్ వంటి దారుణ అనుభ‌వాలు ఉండ‌టంతో విశాఖ‌ప‌ట్నంలో గ్యాస్ లీక్ అనే వార్త‌లు రాగానే అంతా ఉలిక్కి ప‌డ్డారు. ప్ర‌జ‌లు ఎక్క‌డి వారు అక్క‌డే అప‌స్మార‌క స్థితిలో ప‌డి పోతున్న వీడియోలు మ‌రింత ఆందోళ‌న క‌లిగించాయి. అయితే, ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గానే ప్ర‌భుత్వ యంత్రాంగం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌, నేవీ వెంట‌నే అప్ర‌మ‌త్తం కావ‌డంతో చాలా వ‌ర‌కు న‌ష్టం త‌గ్గింది.ప్ర‌త్యేక విశాఖ‌ప‌ట్నం యువ‌త, ప్ర‌జ‌లు చురుగ్గా స్పందించి ఘ‌ట‌న జ‌రిగిన చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల నుంచి వేలాది మంది ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.బాధితుల‌ను పోలీసులు వేగంగా ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించ‌గ‌లిగారు. వైద్య సిబ్బంది, అధికారులు వెంట‌నే ఆక్సిజ‌న్ ద్వారా శ్వాస అందించే ప్ర‌య‌త్నం చేశారు. బాధితుల‌కు వెంట‌నే చికిత్స ఇవ్వ‌క‌పోతే చాలా మ‌ర‌ణాలు సంభ‌వించేవ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కొంత త‌క్కువ న‌ష్టంతోనే విశాఖ‌ప‌ట్నం కొలుకుంటోంది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ప్ర‌భుత్వం స్పందించిన తీరు బాగుంది. ఘట‌న జ‌ర‌గ‌గానే ప్ర‌భుత్వం వేగంగా స్పందించింది. ప్ర‌త్యేకించి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్పందించిన తీరు ప్ర‌తిప‌క్షాల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.ఎక్క‌డైనా, ఏదైనా దుర్ఘ‌ట‌న జ‌రిగితే ప్ర‌తిప‌క్ష పార్టీలు ముందు ప్ర‌భుత్వాన్ని ప‌రిహారం విష‌యంలో డిమాండ్ చేయ‌డం చూస్తుంటాం. ప్ర‌భుత్వం బాధితుల‌కు 5 ల‌క్ష‌లు ప్ర‌క‌టిస్తే 10 ల‌క్ష‌లు లేదా 20 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తుంటాయి. ప్ర‌భుత్వాలు కూడా ఎక్క‌డా రూ.25 ల‌క్ష‌ల‌కు మించి ప‌రిహారం ఇచ్చిన దాఖ‌లాలు అరుదు. అయితే, విశాఖ దుర్ఘ‌ట‌న‌లో ప్ర‌తిపక్షాలు ప‌రిహారం విష‌యంలో ప్ర‌భుత్వాన్ని ఏ విధంగానూ డిమాండ్ చేయ‌లేక‌పోయాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాన‌వీయ‌కోణంలో ఆలోచించి అనూహ్యంగా ప‌రిహారం ప్ర‌క‌టించ‌డ‌మే ఇందుకు కార‌ణం.మ‌ర‌ణించిన వారిని ఎలాగూ తిరిగి తీసుకురాలేన‌న్న జ‌గ‌న్ మ‌న‌సున్న వ్య‌క్తిగా అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు కోటి రూపాయ‌లు, వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 ల‌క్ష‌లు, బాధిత గ్రామాల్లోని 15 వేల మంది ప్ర‌జ‌ల‌కు రూ.10 వేల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన నిర్ణ‌యంతో ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ షాక్ తిన్నాయి. జ‌గ‌న్ ఇంత భారీ స్థాయిలో ప‌రిహారం ప్ర‌క‌టిస్తార‌ని వారంతా ఊహించ‌లేక‌పోయారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌కు ముందే బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌లు ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.తెలుగుదేశం పార్టీ, క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కూడా రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయాల‌ని భావించాయి. కానీ, వారేమీ డిమాండ్ చేయ‌క‌ముందే జ‌గ‌న్ కోటి రూపాయ‌ల ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు.జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న విని తాను న‌మ్మ‌లేక‌పోయాన‌ని, అంద‌రికీ క‌లిసి కోటి ఇస్తున్నారేమో అనుకున్నాన‌ని, ఒక్కొక్క‌రికీ కోటి ఇస్తామ‌ని చెప్ప‌డంతో ఆశ్చ‌ర్య‌పోయాన‌ని విశాఖ‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. మొద‌ట రూ.25 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించారు.అయితే, ప్ర‌భుత్వం ఎందుకు ప‌రిహారం ఇవ్వాలి, కంపెనీ ఇవ్వాలి క‌దా అనే వాద‌న‌ను ప‌లువురు తెర‌పైకి తెచ్చారు. ఈ విష‌యంపై కూడా సీఎం జ‌గ‌న్‌ త‌న ప్ర‌క‌ట‌న‌లో కొంత స్ప‌ష్ట‌త ఇచ్చారు. కంపెనీ నుంచి పరిహారం వీలైనంత ఎక్కువ రాబ‌డ‌తామ‌ని, మిగ‌తాది ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు న‌గ‌రం గ్యాస్ పేలుడు సంభ‌వించి 20 మందికిపైగా మ‌ర‌ణించారు.ఆ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ ఘ‌ట‌నా స్థ‌లిని ప‌రిశీలించి ఇటువంటి సంఘ‌ట‌నలు జ‌ర‌గ‌కుండా కంపెనీలు జాగ్ర‌త్త‌గా ఉండాలంటే బాధితుల‌కు క‌నీసం కోటి రూపాయ‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ న‌గ‌రం లాంటిదే అయిన విశాఖ ఘ‌ట‌న‌లో అప్పుడు చెప్పిన‌ట్లుగానే కోటి ప‌రిహారం ప్ర‌క‌టించారు
 

Related Posts