మద్యం హోం డెలివరీ చేయండి..సుప్రీంకోర్టు
న్యూ ఢిల్లీ మే 8
మద్యం అమ్మకాలపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. హోమ్ డెలివరీ మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది. వైన్ షాపుల వద్ద భారీ జనసమూహాన్ని అరికట్టేందుకు హోం డెలివరీ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై వేసిన పిల్‌పై స్పందిస్తూ కోర్టు ఈ సూచనలు చేసింది. వాస్తవానికి ఈ కేసులో కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. సోషల్ డిస్టాన్సింగ్ అమలు చేయాలంటే.. మద్యాన్ని హోం డెలివరీ చేయాల్సిన అవసరం ఉన్నట్లు కోర్టు చెప్పింది. జస్టిస్ అశోక్ భూషణ్, సంజయ్ కృష్ణ కౌల్, బీఆర్ గవిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సూచన చేసింది. కోర్టు ఈ కేసును వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల మద్యం షాపులు మూతపడ్డాయి. అయితే నాలుగు రోజుల నుంచి కొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాలను మొదలుపెట్టాయి. దీంతో జనం ఒక్కసారిగా షాపుల ముందు చేరుకుంటున్నారు. కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లు ఉంటున్నాయి. ఈ అవస్థలు తప్పించేందుకు కోర్టు ఈ సూచన చేసింది.