YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలోకి...మరో ఎమ్మెల్యే

 వైసీపీలోకి...మరో ఎమ్మెల్యే

 వైసీపీలోకి...మరో ఎమ్మెల్యే
విశాఖపట్టణం, మే 9
ఏపీలో టీడీపీ పరిస్థితి బలహీనంగానే ఉంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో టీడీపీకి గత ఎన్నికల్లో కూసాలు కదిలిపోయాయి. అయితే ఉత్తరాంధ్రాలో టీడీపీకి పట్టుందని భావించిన చోట కూడా ఫ్యాన్ గాలి జోరుగా వీచింది. దాంతో అధికార పీఠానికి టీడీపీ దూరమైంది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా విశాఖ సిటీలో మాత్రం సైకిల్ జోరు చూపించింది. ఇక్కడ నాలుగుకు నాలుగు సీట్లు కూడా పసుపు పార్టీ ఖాతాలో పడ్డాయి. అందులో నెగ్గిన వారు కూడా జమాజెట్టీ లాంటి నాయకులే కావడం వైసీపీకి కొరుకుడుపడడంలేదు. రూరల్ జిల్లాను ఒక్క చేత్తో గెలిచేసిన వైసీపీకి విశాఖ అర్బన్ జిల్లా మాత్రం చిక్కనూ, దొరకనూ అంటోంది.ఇక విశాఖ అర్బన్ జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన పునాదులే ఉన్నాయి. పైగా అక్కడ సీనియర్ ఎమ్మెల్యే గణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 1999లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. మధ్యలో అయన ఒకసారి టీడీపీ నుంచి, మరో సారి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే గణబాబు అప్పట్లో వేసిన రాంగ్ స్టెప్ వల్లనే ఓడారు తప్ప, అక్కడ ఆయన పలుకుబడి తగ్గలేదు, టీడీపీ బలం వీగిపోలేదు అని రుజువు అయింది.ఇక కాంగ్రెస్ కనుమరుగై వైసీపీ ఆవిర్భవించిన తరువాత 2014, 2019 ఎన్నికల్లో వరసగా వైసీపీ ఇక్కడ ఓడిపోతూ వచ్చింది. ఈ రెండు సార్లూ కూడా గణబాబే గెలిచారు. ఆయన తండ్రి, మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పలనరసింహం వారసత్వంతో పాటు, తాను సొంతంగా పెంచుకున్న బలం గణబాబుకు శ్రీరామరక్షగా ఉన్నాయి. ఇక పెద్ద సంఖ్యలో ఉన్న గవర సామాజికవర్గం కూడా టీడీపీ వైపే ఉంటారు. ఆ వర్గం నుంచి వైసీపీలో గట్టి నేతలు లేకపోవడంతో దశాబ్దాలుగా పచ్చ జెండానే ఆ సామాజికవర్గం నమ్ముకోవడంతో గణబాబు విజయం నల్లేరు మీద బండిలా సాగిపోతోంది. ఆయన మీద 2014 ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కొడుకు రత్నాకర్ భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఇక 2019 నాటికి మాజీ ఎమ్మెల్యే, 2009 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ తరఫున గెలిచిన నగరవాసి, సినీ నిర్మాత కూడా అయిన మళ్ళ విజయప్రసాద్ సైతం ఓటమిపాలు కావడంతో అక్కడ టీడీపీని కొట్టలేమని వైసీపీ పెద్దలకు అర్ధమైపోయింది.ఈ పరిణామాలన్నీ బేరీజు వేసుకున్న మీదట గణబాబు టీడీపీ నుంచి పోటీలో ఉంటే గెలవలేమని వైసీపీ డిసైడ్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. దాంతో గణబాబునే పార్టీలోకి లాగేయాలన్న ఆలోచనలు కూడా వైసీపీలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే గణబాబు ఒకసారి టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరి ఓటమి పాలు అయ్యారు. అందువల్ల తన వ్యక్తిగత ఇమేజ్ తో పాటు టీడీపీ బలం ఉంటేనే గెలుపు సాధ్యమని బలంగా నమ్ముతున్నారు. పైగా ఆయన అయిదేళ్ళు ప్రతిపక్షంలో ఉంటే పోయేదేమీలేదని కూడా తన అనుచరులతో అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎపుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. టీడీపీ భవిష్యత్తు మీద అపనమ్మకం కనుక ఉంటే నేతలంతా ఇపుడు కాకపోయినా వచ్చే ఎన్నికల ముందు అయినా గోడ దూకేస్తారు. అటువంటి వారిలో గణబాబు కూడా ఉంటారని వైసీపీ వ్యూహకర్తలు ఆశపడుతున్నారు.

Related Posts