గౌతంరెడ్డికి తిరుగు లేదంట
నెల్లూరు, మే 9,
జగన్ కి మంత్రులందరూ సమానమే. ఇంకా చెప్పాలంటే 150 మంది ఎమ్మెల్యేలు జగన్ మనుషులే. వైసీపీలో ఉన్న ప్రతీ కార్యకర్తలోనూ జగన్ ఉన్నాడు. అయితే ఎంత అందరూ తన వారు అనుకున్నా కూడా జగన్ కి కూడా తనకు బాగా నచ్చిన వారు ఉంటారు కదా. అయితే ఆ తేడా ఆయన అభిమానంలో చూపించరు. పని, ప్రతిభ కొలమానంగా తీసుకుని బాగా చేసిన వారిని శభాష్ అని వెన్నుతడుతారు. అదే విధంగా వారిని మరో మెట్టు ఎక్కిస్తారు నిజంగా పనిచేసేవారికి కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు కావాలి కూడా. ఇపుడు జగన్ నుంచి అలా మెప్పు పొంది ఒక్కో మెట్టు ఎక్కుతున్న యువ మంత్రి ఒకరు ఉన్నారు. ఆయనే మేకపాటి గౌతంరెడ్డి. ఆయన కుటుంబం అంటే కూడా జగన్ కి ప్రత్యేకమైన అభిమానం. గౌరవం. జగన్ ఏమీ కానీ వేళ కొండ లాంటి కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవిని ఒంటి చేత్తో విసిరేసి వచ్చి జగన్ పక్కన నిలబడిన నేత రాజమోహన్ రెడ్డి.ఇక జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ తన ఎంపీల చేత రాజీనామాలు చేయించారు. అలా చేసిన వారిలో రాజమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనకు గత ఎన్నికలో ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఆయనకు బదులుగా కొడుకు గౌతంరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేసి తన మాటను నిలబెట్టుకున్నారు జగన్. అంతే కాదు, కీలకమైన భారీ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖలను కూడా కట్టబెట్టారు. గౌతంరెడ్డి తనకు ఇచ్చిన శాఖలలో బాగా పనిచేస్తున్నాట్లుగా జగన్ గుర్తించారు. దాంతో సంత్రుప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. దాంతో అదనంగా తన దగ్గర ఉన్న పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖను కూడా గౌతం రెడ్డికిఏ జగన్ కేటాయించారు.ఇపుడు ఏపీ కష్టాల్లో ఉంది. విభజన తరువాత హైదరాబాద్ లాంటి నగరం కోల్పోయింది. గట్టిగా ఆదాయం వచ్చే సిటీ లేదు, అన్నీ టూ, త్రీ టైర్స్ సిటీలే ఉన్నాయి. విశాఖలో ఉన్న వాటిలో మెరుగైన స్థితిలో ఉంది. దాంతో ఏపీని అభివృధ్ధి చేయాలంటే పారిశ్రామికంగా ఎదగాలి. అందుకోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలి. మరి స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన గౌతంరెడ్డి తనకు అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తారని జగన్ భావించే అదనపు బరువు కూడా ఆయన మీద పెట్టారని అంటున్నారుదీన్ని బట్టి ఆలోచన చేస్తే జగన్ మంత్రివర్గంలో అయిదేళ్ళ మంత్రి ఎవరు అంటే ఠక్కున మొదటి పేరుగా గౌతంరెడ్డిని చెప్పుకోవాలి అంటున్నారు. ఆయనకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యత, జగన్ వద్ద ఆయనకు ఉన్న పలుకుబడి, మంచిపేరు, వారి కుటుంబంతో జగన్ కి ఉన్న అనుబంధం వంటివి పరిగణన లోకి తీసుకుంటే కచ్చితంగా అయిదేళ్ళూ గౌతంరెడ్డి మంత్రిగా ఉంటారని, పైగా కీలకమైన భారీ పరిశ్రమల శాఖ ఆయన వద్దనే ఉంటుందని అర్ధమవుతోంది. ఇక 2024 లోగా ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చి పరిశ్రమల స్థాపనకు కనుక గౌతంరెడ్డి కృషి చేస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మళ్ళీ ఆయన మంత్రి అవడం ఖాయమన్న మాట కూడా ఉంది . మొత్తానికి జగన్ కి నచ్చిన మంత్రిగా ఇపుడు అంతా ఆయన్ని పిలుస్తున్నారుట.