
పరీక్షల షెడ్యూల్స్...
హైద్రాబాద్, మే 9
కరోనా కారణంగా తెలంగాణలో అర్థాంతరంగా ఆగిపోయిన టెన్త్ పరీక్షల నిర్వహణపై అనుమానాలు తొలిగిపోయాయి. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు పరీక్షలు జరుగుతాయా లేదా అనే సందేహాలకు స్వయంగా సీఎం కేసీఆర్ తెరదించారు. ఈ నెలలోనే అంటే మే లోనే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మార్చిలో టెన్త్ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. మూడు పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత కరోనా భయాలతో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంకా ఎనిమిది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.టెన్త్ పరీక్షలు నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయించారు.హైకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం మిగతా 8 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. గతంలో ఏర్పాటుచేసిన దాదాపు 2500 పరీక్షా కేంద్రాలను అవసరమైతే 5000కు పెంచుతామన్నారు. ఇంకా అవసరమైతే 5వేల 500 చేస్తామన్నారు. అలాగే భౌతిక దూరం పాటిస్తూ ఒక హాల్‌లో తక్కువ విద్యార్థులుండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పరీక్ష గదులను పూర్తిగా శానిటైజ్ చేస్తామని చెప్పారు. పరీక్ష రాసే విద్యార్థులకు మాస్కులు అందిస్తామని సీఎం అన్నారు. 'పరీక్షల నిర్వహణపై కేబినెట్ నిర్ణయం తీసుకొని అడ్వకేట్ జనరల్‌కు ఆదేశాలిచ్చింది. తక్షణమే కోర్టులో అప్లయ్ చేయమన్నాం. సీజే ముందు అప్లయ్ చేసి కన్సంట్ తీసుకోమన్నాం. కోర్టు కూడా పర్మిషన్ ఇస్తుందని భావిస్తున్నాం. పిల్లలు, తల్లిదండ్రులు టెన్షన్‌లో ఉన్నారు. వీరికోసం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటాం. విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేసి. పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తాం. ధనవంతుల పిల్లలుంటే వాళ్లకు స్పెషల్ కారు పాసులు కూడా ఇస్తాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎస్‌ఎస్‌సీ పరీక్షలను మే నెలలోనే పూర్తి చేస్తాం. ఎందుకంటే ఎస్‌ఎస్‌సీ ఆధారంగానే ఇతర అడ్మిషన్స్, ఇంటర్ చదువు ఆధారపడి ఉంటుంది'' అని సీఎం అన్నారు.
జూన్ లో ఇంటర్ రిజల్స్
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను వచ్చేనెల రెండో వారంలో, ప్రథమ సంవత్సరం ఫలితాలు వచ్చేనెల మూడోవారంలో విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మూల్యాంకనం చేసే అధ్యాపకుల మధ్య భౌతికదూరం పాటించాలనే ఉద్దేశంతో 12 కేంద్రాలను 33 కేంద్రాలకు పెంచామని చెప్పారు. ప్రతి మూల్యాంకనం కేంద్రంలో 600 నుంచి 700 మంది అధ్యాపకులు మూల్యాంకనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈనెల 7 నుంచి 11 వరకు మూల్యాంకనం పత్రాలకు కోడింగ్ ప్రక్రియను చేపడతామన్నారు. ఈనెల 12 నుంచి 30 వరకు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేస్తామని అన్నారు. కరోనా నేపథ్యంలో మార్చి 23న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడల్ లాంగ్వేజెస్ పరీక్షలను ఈనెల 18న నిర్వహిస్తామని వెల్లడించారు. గతంలో కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశామన్నారు. 17 పరీక్షా కేంద్రాల్లో 861 మంది విద్యార్థులు రాస్తారని చెప్పారు. పదో తరగతిలో మిగిలిన పరీక్షలను నిర్వహించే ముందు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించామన్నారు. హైకోర్టు అనుమతించిన వెంటనే పరీక్షల తేదీలను ప్రకటిస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేయాలని నిర్ణయించామని వివరించారు. పెంచుతున్న పరీక్షా కేంద్రాలు, వాటిలో పరీక్షలు రాసే విద్యార్థులకు విస్తృత ప్రచారాన్ని కల్పించాలని కోరారు. విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లకు ప్రత్యేకంగా మాస్క్‌లు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రోజూ పరీక్షా కేంద్రాలను కెమికల్ శానిటైజేషన్ చేస్తామని వివరించారు. అనారోగ్యంతో ఉండే విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులు సేద తీరేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. పరీక్షా కేంద్రాల్లో బల్లపై ఒక్కరే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.