లాక్‌డౌన్ సడలింపుకు జరిమానాలు పరిస్కారమా!
హైదరాబాద్ మే 9
రాష్ట్రంలో లాక్‌డౌన్ సడలింపులను ఆసరాగా చేసుకుని ప్రజలు యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. బైక్‌లపై ఇద్దరు-ముగ్గురు, కార్లలో నలుగురు-ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మద్యం షాపులు, కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్ల వద్ద భౌతిక దూరం నిబంధన గాలికి పోయింది. దుకాణాలకు సరి, బేసి అంకెలను వేసి రోజు విడిచి రోజు తెరవాలని ఆంక్షలు విధించినప్పటికీ.. చాలా చోట్ల అమలుకు నోచుకోలేదు. నో మాస్క్... నో సేల్ పేరిట బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ అటు.. వ్యాపారులుగానీ, ఇటు వినియోగదారులుగానీ మాస్కులు ధరించడం లేదు. చాలా దుకాణాల్లో శానిటైజర్లను ఏర్పాటు చేయలేదు. రెడ్ జోన్ ప్రాంతాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం ట్రాఫిక్ సిగ్నళ్లు ఆన్ అయ్యాయి. ఫ్లైఓవర్లన్నీ తెరవడంతో మహానగర జంక్షన్లన్నీ వాహనదారులతో జామ్ అయ్యాయి. అక్కడక్కడా వాహనాలు తనిఖీ చేసి చలానాలు విధించినా.. మెజారిటీ ప్రాంతాల్లో పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరించారు. సాధారణ ట్రాఫిక్‌తో పోలిస్తే దాదాపు 40 శాతం వాహనాలు రోడ్లపై కనిపించాయి.సిరిసిల్ల మునిసిపాలిటీ పరిధిలో జనం అధిక సంఖ్యలో రోడ్లపై తిరుగుతున్నారు. దుకాణాల వద్ద భౌతికదూరం పాటించకపోవడం, మాస్క్‌లు ధరించకపోవడంతో మున్సిపల్ అఽధికారులు జరిమానాలు వేశారు.నిర్మల్ జిల్లాలో మద్యం దుకాణాల వద్ద మందు బాబులు మాస్కులు ధరించి వచ్చినప్పటికీ భౌతికదూరం పాటించలేదు. ఆర్మూర్‌లో ఆరు గంటల తర్వాత కూడా షాపులు మూసివేయకపోవడంపై మున్సిపల్ కమిషనర్ శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు షాపులను తనిఖీ చేసిన ఆమె.. దుకాణాదారులకు రూ.12,500 ఫైన్ విధించారు.సంగారెడ్డ్డి జిల్లాలో భౌతికదూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, సరి-బేసి సంఖ్యలో దుకాణాలు తెరవడం ప్రహసనంగా మారింది. జోగిపేటలో సరి-బేసి విధానానికి వ్యాపారులు తిలోదకాలిచ్చారు. గ్రీన్‌జోన్‌గా ఉన్న సిద్దిపేట జిల్లాలో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మళ్లీ ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాస్కులు ధరించనందుకు 130 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.కొత్తగూడెం పరిధిలోని మద్యం దుకాణాలను కలెక్టర్ ఎంవీ రెడ్డి తనిఖీ చేశారు. ఓ దుకాణం వద్ద అపరిశుభ్రత ఉండడంతో వెంటనే రూ.25వేలు జరిమానా విధించారు.