సాయంపేరుతో మహిళపై రేప్
హైద్రాబాద్, మే 9,
హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. నిత్యవసరాల వితరణ ముసుగులో 70 ఏళ్ల వృద్ధుడు పేద యువతిపై అత్యాచారం చేశాడు. నిత్యవసర సరుకులు ఇస్తానని నమ్మించి ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థలు, ఇతరత్రా పలువురు పేదలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తుండడంతో నిజమేనని నమ్మేసిన యువతి అతని ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా ఆమెకు మత్తుమందిచ్చిన వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు.బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన సలీముద్దీన్(70) నిత్యవసర సరుకులకు ఆర్థిక సాయం చేస్తానని నమ్మించి అదే ప్రాంతానికి చెందిన యువతి(23)పై అత్యాచారం చేశాడు. సాయం చేస్తానని నమ్మించి ఇంటికి తీసుకెళ్లి మత్తుమందిచ్చి ఆమెను రేప్ చేశాడు. స్పృహలోకి వచ్చిన యువతి తనపై అత్యాచారం జరిగినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. నేరుగా హైదరాబాద్ కమిషనర్‌ని కలసి ఫిర్యాదు చేయడంతో ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు సలీముద్దీన్‌ని అరెస్టు చేశారు. పోలీసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. సలీముద్దీన్ నలుగురు భార్యలు విదేశాల్లో ఉన్నారని.. అతను కూడా విదేశాల్లోనే ఉంటాడని తెలిసింది. అప్పుడప్పుడూ నగరానికి వచ్చి సాయం పేరుతో పేద యువతులకు వల విసిరి దారుణాలకు పాల్పడుతుంటాడని తెలుస్తోంది.