YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

నామినేటెడ్ ఎప్పటికి వచ్చేను...

నామినేటెడ్ ఎప్పటికి వచ్చేను...

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నా... నేటికీ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి కమిటీలు లేవు. తెలంగాణాలో గులాబీ పార్టీ నేతలను నామినేటెడ్‌ పదవులు దాదాపు నాలుగేళ్లుగా ఊరిస్తూనే ఉన్నాయి. ఇవాళా...రేపు అంటున్న పార్టీ పెద్దలు పదవుల భర్తీకి శ్రీకారం చుట్టకపోవడంతో..పార్టీ నేతల్లో కూడా అసంతృప్తులు రగులుతున్నాయి. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నామమాత్రంగానే పదవులు పంపిణీ చేసిన అధికార పార్టీ..ఇంకా ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు పెండింగ్‌లోనే ఉంచుతూ వస్తోంది.రాష్ట్ర విభజన తర్వాత పలు కార్పొరేషన్ల విభజనపై స్పష్టత రాకపోవడంతో మొదటి ఏడాది పదవుల భర్తీ జరగలేదని అధికార పార్టీ ఇప్పటివరకు చెప్తూ వచ్చింది. కానీ..మెజార్టీ కార్పొరేషన్‌లలో విభజన సమస్యలు తొలగినా ఇంకా పదవులు భర్తీకి నోచుకోవడం లేదు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దాదాపు 4వేల పదవులు ఉంటాయిని నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ పరంగా దాదాపు ఏడాది క్రితం జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక మాత్రమే జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుల ఎన్నికలు అనివార్యం కావడంతో ఆ తంతును పూర్తి చేశారు. ఆ తర్వాత అనుబంధ సంఘాలు, జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యవర్గాలను ఇప్పటి వరకు పార్టీ అధినేత నియమించలేదు. పార్టీకి అత్యున్నత కమిటీగా భావించే పోలిట్ బ్యూరో సభ్యుల నియామకం కూడా జరుగలేదు. దీంతో పార్టీ పదవులు కూడా భారీగానే పెండింగ్‌లో ఉన్నాయి.రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసినా... చాలా జిల్లాలకు కమిటీలు లేవనే చెప్పాలి. దీంతో పార్టీలో పదవులు దక్కుతాయని ఆశిస్తున్న నేతలకు నిరాశే మిగులుతోంది.  ప్రజాక్షేత్రంలో పార్టీ బలంగా రూపుదిద్దుకోవాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు ఏర్పడాలి. అంతేకాదు.. రాష్ట్ర కమిటీతోపాటు... దాని అనుబంధ సంఘాలను పార్టీలు నియమించుకుంటాయి. కానీ గులాబీ పార్టీ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.  ఉద్యమ సమయంలో ఎంతో చురుగ్గా పని చేసిన కార్యకర్తలు పార్టీకి ఉన్నా......వారికి  పార్టీ పదవులు కట్టబెట్టని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ పదవులకు ప్రాధాన్యత ఉంటుందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆశించినా.. పదవులు మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గతంలో ఉన్న పార్టీ నిర్మాణాన్ని సవరించారు. దీంతో పార్టీ నియమావళి ప్రకారం పదవులు భర్తీ చేస్తామని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించినా...ఆ పదవులు భర్తీకి నోచుకోవడం లేదు. ఈ నెలాఖరున జరిగే పార్టీ ప్లీనరీకి టీఆర్‌ఎస్ సిద్ధమవుతుండడంతో కార్యకర్తలకు మరో సారి ఆశలు చిగురిస్తున్నాయి.  గ్రామ, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో  సమన్వయ కమిటీల నియామకం ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడితో పాటు మరో కన్వీనర్ ను నియమించే విధంగా పార్టీ  నిబంధనలను అమలు చేయాల్సి ఉంది.పదవులపై ఆశలు పెంచుకున్న నేతలకు  నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్లీనరీ నాటికి కూడా పార్టీ పదవులు భర్తీ చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో పార్టీ కంటే ప్రభుత్వ పనితీరుపైనే  కేసీఆర్ దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరుతో మరోసారి అధికార పగ్గాలు దక్కించుకోవాలని గులాబీ బాస్‌  భావిస్తున్నారు. దీంతో పార్టీ పదవులు ఇప్పట్లో భర్తీ చేసే సూచనలు కనిపించడం లేదు.రాష్ట్ర స్థాయిలో గతంలో ఉన్న పోలిట్ బ్యూరో, రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించాల్సి ఉన్నా...పార్టీ అవసరాల రీత్యా రాష్ట్ర స్థాయిలో ప్రధానకార్యదర్శులు, కార్యదర్శలను మాత్రమే కేసీఆర్ నియమించారు. అయితే పార్టీ పదవులకు ప్రాధాన్యత ఉన్నా... ప్రభుత్వ పనితీరే గీటురాయి అంటూ సీఎం కేసీఆర్‌ కార్యవర్గాల ఎంపిక పై దాటవేస్తున్నారన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది.

Related Posts