స్టైరీన్ లీకేజీపై ఐరాస స్పందన
ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సూచన
ముంబాయి మే 9
విశాఖపట్నంలో స్టైరీన్ వాయువు లీకేజీ ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. విష వాయువు పీల్చి మృతిచెందిన వారి కుటుంబాలకు సంస్థ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వం ఘటనపై దర్యాప్తు చేయించాలని సూచించారు. ‘మా జోక్యం ఉంటుందో లేదో తెలియదు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. వాయువు ప్రభావానికి గురైన బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ఘటనలపై పూర్తిగా స్థానిక ప్రభుత్వాలు దర్యాప్తు చేయించాలని భావిస్తున్నాం’ అని ఐరాస అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ అన్నారు. సంబంధిత ఘటనపై ఐరాస సెక్రటరీ జనరల్ స్పందన ఏంటి? సమితి జోక్యం చేసుకుంటుందా? అని డుజారిక్ను విలేకరులు ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానమిచ్చారు. విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్లో విష వాయువు లీకవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.