YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*సర్వాంతర్యామి*

*సర్వాంతర్యామి*
*సర్వాంతర్యామి*

మునులు, రుషులు, వేదాంతులు, పరమపావనులు సైతం పూజించేది శ్రీమహావిష్ణువు పాద పద్మాలను. ఆయనను పరమ పురుషుడు, ఆదిపురుషుడు అనీ పిలుస్తారు. ‘ప్రతి యుగంలో పురుష తేజస్సుతో భూమి మీద అవతరించి, నీచపరాక్రమవంతులు, దుష్టులు అయిన రాక్షసులను సంహరిస్తాడని, సాధుసజ్జనులను సాకుతాడని, సృష్టి గమనం సజావుగా సాగేలా పర్యవేక్షిస్తాడని... అందుకే ఆయన్ని పరమ పురుషుడని పిలుస్తారు’ అని భాగవతం మూడో స్కంధం చెబుతోంది. ఇక్కడ పురుష పదాన్ని లింగవాచకంగా స్వీకరించకూడదు. ఆ పదానికి నిర్గుణుడు, నిరాకారుడు, నిరామయుడు, నిశ్చలుడు, సర్వశక్తి సమన్వితుడు అయి, నిత్య వ్యాపారుడు/ చైతన్యవంతుడైనవాడు’ అని భాష్యం చెబుతోంది వేదం. స్వయంభువుడైన పరమాత్మ నుంచి సృష్టిలోని నాలుగో భాగం మొదట పుట్టింది. అది స్థిరమైనది, శాశ్వతమైనది. అందులోనుంచి చేతన-అచేతన, స్థితి-సంహార, వృద్ధి-నాశన మొదలైన భౌతిక లక్షణాలతో మిగిలిన మూడు భాగాల జగత్తు ఉద్భవించింది. ఈ సమస్త సృష్టికి సత్వ స్వభావమే ప్రకృతిగా గల ఆయనే కారకుడు, ఆధారుడు, పోషకుడు, నియంత్రకుడై ఉన్నాడు. అణువు మొదలు బ్రహ్మాండం వరకు పరిణామాలన్నీ ఆయన ఆజ్ఞకు లోబడే జరుగుతాయి. ఆయన అనుజ్ఞతో కాల స్వరూపమే ఉపాధిగా, సత్వరజస్తమో గుణాలనే ప్రకృతుల్లో కదలికలు ఏర్పడి, సృష్టి స్థితి లయమనే విభాగాలు నెలకొన్నాయి. ‘వీటన్నింటినీ గతి తప్పకుండా పర్యవేక్షణ చేసేవాడు, నిత్యం స్వస్థితిలో ఉండేందుకు కారకుడు అయినవాణ్ని పరమపురుషుడు అంటారు’ అని భాగవతం సప్తమ స్కంధం తెలియజెబుతోంది. అందరి ఉనికికీ ఆధారమైన ఈ విశ్వమంతా అన్నీ తెలిసిన ఆ పురుషుడిలోనే నిబిడీకృతమై ఉంది అంటూ... ఆ పురుషుడు సూర్యకాంతితో ప్రకాశించేవాడు, వేద స్వరూపుడు, కాలాన్ని నియంత్రించేవాడు, కర్మలు సక్రమంగా సాగడానికి చలి, ఎండ, గాలి, వాన మొదలైన స్థితులను కల్పించి సమస్త జగత్తునూ సమస్థితిలో ఉంచుతున్నవాడు; మాయకు అతీతుడు, బ్రహ్మాది దేవతలను సృజించినవాడు, తనకు రూపం లేకున్నా అన్ని రూపాలూ తానే అయినవాడు... కాబట్టే ఆ విరాట్పురుషుణ్ని పరమాత్మ (గొప్ప ఆత్మ స్వరూపుడు) అని భాగవతం చెబుతోంది. అలా సర్వాంతర్యామి అయిన నారాయణుణ్ని రుగ్వేదంలో రుక్కులు, సామవేదంలో సామాలు, మిగిలిన వేదాలు ఇతర రకాలుగా స్తుతిస్తున్నాయని భాగవతం పంచమస్కంధం వల్ల తెలుస్తోంది. ‘అలాంటి పరమ పురుషుడైన శ్రీహరిపై ఆత్మను నిలిపినవారికి భేదభావం, దేహభ్రాంతి, మనోచాంచల్యం, ఫలాపేక్ష లాంటివి ఉండవు. అలాంటివారికి కర్మబీజాలు అంటవు. ఫలితంగా జీవన్ముక్తులవుతారు’ అని భాగవతం స్పష్టంగా చెబుతోంది. ఇలా శ్రుతులు కీర్తించిన సర్వాంతర్యామి అయిన ఆ పరమ పురుషుడి అనుగ్రహం పొందడానికి, ఆయన చైతన్యాన్ని అణువణువునా ఆస్వాదించి తరించాలనేదే భాగవత సందేశం

Related Posts