YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*నారసింహాయనమః*

*నారసింహాయనమః*
*నారసింహాయనమః*
శ్రీమహావిష్ణువు పది అవతారాల్లో నాలుగోది నరసింహావతారం. వైశాఖ శుద్ధ చతుర్దశినాడు నారసింహుడు ఆవిర్భవించాడు. వైకుంఠ ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు బ్రహ్మ మానస పుత్రులైన సనకసనందాదుల శాపం వల్ల హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. యజ్ఞవరాహ రూపంలో శ్రీహరి హిరణ్యాక్షుణ్ని వధించడంతో, హిరణ్యకశిపుడు ప్రతీకారవాంఛతో బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. నరులు, మృగాలవల్లకాని, పగలుకాని రాత్రికాని, ప్రాణమున్నవాడి చేతగాని, లేనివాడి చేతగాని తనకు చావు లేకుండేలా వరం కోరుకున్నాడు. బ్రహ్మ ‘సరే’ అన్నాడు. హిరణ్యకశిపుడు మందర పర్వతం మీద తపస్సులో ఉన్నాడు. దేవేంద్రుడు,
హిరణ్యకశిపుడి భార్య గర్భవతి అయిన లీలావతిని అపహరించి తీసుకువెడుతున్నాడు. నారదుడు అడ్డుకుని లీలావతిని తన ఆశ్రమానికి వెంటపెట్టుకు వెళ్లాడు. నారదుడు విష్ణుగాథలను, ధర్మతత్త్వాన్ని బోధిస్తుంటే, లీలావతి గర్భంలో ఉన్న శిశువు ఆ బోధలన్నీ గ్రహించాడు. వరాలు పొందిన హిరణ్యకశిపుడు నారదుడికి కృతజ్ఞతలు తెలిపి భార్యను తన ఇంటికి తీసుకెళ్లాడు. పుట్టిన బిడ్డకు ‘ప్రహ్లాదు’డని నామకరణం చేశాడు. కొన్ని సంవత్సరాల తరవాత ప్రహ్లాదుణ్ని విద్యాధ్యయనం కోసం గురువులు చండామార్కుల వద్ద చేర్చాడు. వరబల గర్వంతో ప్రజలను, రుషులను, దేవతలను హింసించసాగాడు.ప్రహ్లాదుడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ గొప్ప విష్ణుభక్తుడయ్యాడు. తన శత్రువైన విష్ణువును స్మరిస్తున్నందుకు ప్రహ్లాదుణ్ని తండ్రి తీవ్రంగా శిక్షించసాగాడు. ‘చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ’ అని చెబుతూ శ్రీహరినే స్మరించి ముక్తిపొంది సార్థక జన్ముడవుకమ్మని తండ్రికి బోధించాడు. నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించిన తండ్రికి ‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ అంటూ వినమ్రుడై బదులు చెబుతాడు. నీ శ్రీహరిని ఈ స్తంభంలో చూపగలవా అన్న ప్రశ్నకు చూపగలనని ప్రహ్లాదుడు బదులిస్తాడు. హిరణ్యకశిపుడు గదతో స్తంభాన్ని మోదుతాడు. స్తంభం బద్దలై అందులోంచి నరసింహ రూపంలో స్వామి ప్రాణసహితం, ప్రాణరహితంగాని వాడిగోళ్లతో, పగలు రేయికాని సంధ్యాసమయంలో సగం మృగంగా, సగం మానవ రూపంగా, ఇంటా బయటాకాక ద్వార గడపమీద నేలనింగీకాక తన ఒడిలో పడుకోబెట్టుకుని హిరణ్యకశిపుణ్ని చీల్చి వధించాడు. ఉగ్రరూపంలో ఉన్న నారసింహుణ్ని ప్రహ్లాదుడు స్తుతించి శాంతింపజేశాడు. ‘నర’ అనే పదానికి మరణం అని ‘సింహ’ పదానికి నాశం చేసేదని అర్థాలు. నారమంటే జీవకోటి, సింహమంటే ఈశ్వరుడని అర్థాలున్నాయి. జీవుడు ఈశ్వరుడితో ఐక్యం పొందాలనేదే ఈ అవతార ప్రబోధం. స్తంభం మనో నిశ్చలత్వానికి ప్రతీక. ఈ స్థితిని యోగమార్గంలో రమణ మహర్షి చెప్పినట్లు ప్రాణాయామం ద్వారాకాని, శంకరులు చెప్పినట్లు జ్ఞానమార్గంలో ‘సత్సాంగత్యం’ ద్వారా సోపానక్రమంగా, నిశ్చల తత్త్వానికి చేరుకోవడం ద్వారా కాని ముక్తిని పొందవచ్చునని దీని సందేశం. నృసింహ చతుర్దశి వ్రతవిధానాన్ని హేమాద్రి, నృసింహ పురాణం, స్కాందపురాణం వివరిస్తున్నాయి. యాదాద్రి, అహోబిలం, వేల్పుగొండ, మంగళగిరి, సింహాచలం, కదిరి, కోరుకొండ... ఇలా అనేక క్షేత్రాల్లో శ్రీలక్ష్మీ సమేతుడైన శ్రీనృసింహస్వామి భక్తుల అర్చనలు, ఆరాధనలు అందుకుంటున్నాడు. స్మృతి దర్పణం, గదాధర పద్ధతి, పురుషార్థ చింతామణి, చతుర్వర్గ చింతామణి, బ్రహ్మపురాణం మొదలైన గ్రంథాలన్నీ శ్రీలక్ష్మీనరసింహుడి అపార కృపాకటాక్ష మహిమల్ని విస్తృతంగా వర్ణించాయి
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts