YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*ప్రేమ మాధుర్యం*

*ప్రేమ మాధుర్యం*
*ప్రేమ మాధుర్యం*

ప్రేమ విశ్వజనీనమైనది. అది వాస్తవాన్ని యథాతథంగా స్వీకరిస్తుంది. మనిషి ఆలోచనలలోను, చేతలలోను స్వచ్ఛతను కలిగిస్తుంది ప్రేమ. మనిషిని ఉదాత్తుడిగా తీర్చిదిద్దేదీ ప్రేమే. స్వచ్ఛమైన ప్రేమ విశ్వశాంతిని కోరుతుంది. అందుకే ప్రేమమూర్తులు విభేదాలకు దూరంగా ఉంటారు. వారు ఎవరినీ ద్వేషించరు. ఎవరినీ పరాయివారిగా భావించరు. వారికి పెద్దలంతా గౌరవనీయులు, తోటివారంతా స్నేహితులు, చిన్నవారంతా ప్రీతిపాత్రులు. నిజానికి ఆ భగవంతుడికీ ప్రేమతో కూడిన భక్తిభావనే ముఖ్యం. అప్పుడే అతడు ప్రీతి చెందుతాడు. అందుకే గీతలో శ్రీకృష్ణుడు పరిపూర్ణమైన ప్రేమతోనే తనను పొందడం సాధ్యమని ఉపదేశించాడు. పండో, పూవో, చివరికి జలమైనా సరే... భక్తి, ప్రేమతో ఇస్తే తాను స్వీకరిస్తానని స్పష్టం చేశాడు. పరమాత్మ అందరినీ ఆదుకునే కరుణాళువు. ఆయనను ధ్యానిస్తూ ఎండిపోయిన బిల్వపత్రాలతో పూజచేసినా, దేవాలయ నిర్మాణంలో రాళ్లు మోసినా ఆ ప్రేమను ఆయన స్వీకరిస్తాడు. తన భక్తుల్ని అనుగ్రహిస్తాడు. నారదమహర్షి చెప్పినట్లు- భక్తి అంటే గోపికలదే. వారిది దివ్యమైన ప్రేమ. వారు శ్రీకృష్ణుణ్ని నిర్మలంగా ప్రేమించారు. ఆ ప్రేమకు అవధుల్లేవు. ఆ ప్రేమలో ప్రతిఫలాపేక్ష లేనేలేదు. అందరూ పరమాత్మను అలాగే ప్రేమించాలి. అప్పుడే ఆయన ప్రసన్నుడవుతాడు. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ఆయన స్వరూపం తెలుసుకోవాలంటే మనసు నిండా ప్రేమను నింపుకోవాలి. అందరినీ సమదృష్టితో ప్రేమించాలి. ప్రేమకు హద్దులు ఎల్లలు లేవు. ప్రేమ ఉన్నచోట అపోహలకు, అనర్థాలకు తావుండదు. ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకున్నవారికి ఆగ్రహావేశాలు, ఈర్ష్యాద్వేషాలు ఉండవు. ప్రేమకు లొంగనిది ఏదీ ఈ ప్రపంచంలో లేనేలేదు. ప్రేమ అంతటి శక్తిమంతమైనది. దేన్నయినా అవలీలగా స్వీకరించగలిగేది ప్రేమ ఒక్కటే. అప్పుడే పుట్టిన లేగదూడను ఆవు ఎంతగా ప్రేమిస్తుందో అంత ప్రేమ మనలో ఉండాలని అధర్వణ వేదం చెబుతోంది. మనం కూడా ఇతరులను అలాగే ప్రేమించాలి. అదే వాస్తవమైన ప్రేమ. అసలు ప్రేమ అనే రెండక్షరాల్లోనే అద్భుతమైన ఆకర్షణ ఉంది. శత్రువును మిత్రుడిగా మార్చగల శక్తి ప్రేమకు మాత్రమే ఉంది. మనిషి తన జీవితంలో ఏదైనా సాధించాలంటే అది ప్రేమతోనే సాధ్యపడుతుంది. అందుకే మనిషి ప్రేమస్వరూపుడు కావాలని రుషులు చెప్పారు. ప్రేమంటే ఒక పవిత్రభావన. మధురమైన మానసిక స్థితి. ప్రేమించే అన్ని హృదయాల్లో భగవంతుడు ఉంటాడంటారు ఆధ్యాత్మికవేత్తలు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, రాధ, గోదాదేవి, మీరాబాయి మొదలైనవారు ఆ పరమాత్ముడినే నమ్ముకుని ఆరాధించి తరించారు. జాతిపిత గాంధీజీ కూడా ఎప్పుడూ సత్యం, ప్రేమ విడిచిపెట్టవద్దని చెప్పేవారు. సర్వమానవాళి శ్రేయస్సే ప్రేమ ధ్యేయమని బోధించేవారు. కులమతాలకు అతీతమైన సమాజ నిర్మాణానికి ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. సమాజం ఆదర్శవంతంగా రూపుదిద్దుకోవడానికీ ప్రేమ పునాదిగా నిలుస్తుంది. ప్రేమ విశాల దృక్పథాన్నీ కలిగిస్తుంది. అలాంటి దృక్పథం గల వ్యక్తి సాటివారి సమస్యలను తప్పక అర్థం చేసుకుంటాడు. మనిషికి మనిషికి మధ్య అవినాభావ సంబంధాన్ని కలిగించేది ప్రేమ మాత్రమే. అందరినీ ప్రేమించినప్పుడే అందరినీ సేవించాలనే భావన కలుగుతుంది. అప్పుడు విశ్వమంతా మన కుటుంబమనే భావన మనసులో ఏర్పడుతుంది. అందుకే ఏ ఇద్దరి మధ్యనైనా ప్రేమ భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్న అనుబంధంలా శాశ్వతంగా, పవిత్రంగా ఉండాలి
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts