రెట్టింపు ధరలు పలుకుతున్న బెల్లం
అనకాపల్లి, మే 11
వరుస విపత్తులతో, నిరాశాజనక ధరలతో విలవిల్లాడిపోతున్న చెరకు రైతుకు ఈ ఏడాది బాగా ఊరట కలిగించింది.అనకాపల్లి మార్కెట్లో బెల్లం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఒకటో రకం బెల్లం వంద కిలోల ధర 4,825 రూపాయలు పలికింది. ఈ నెల ఐదో తేదీన ఇదే బెల్లం అత్యధికంగా 4,700 రూపాయలు పలికి రికార్డు సృష్టించింది. ఆ రికార్డును మంగళవారం అధిగమించింది. సోమవారంతో పోల్చితే 180 రూపాయలు ఒక్కరోజులోనే పెరగడం విశేషం. సోమవారం వంద కిలోలు 4,645 రూపాయలు పలకగా 4,825 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్‌కు బెల్లం దిమ్మలు రాక భారీగా తగ్గిపోయింది. 2898 బెల్లం దిమ్మలు మాత్రమే యార్డుకు వచ్చాయి. వీటిలో ఒకటో రకం బెల్లం తక్కువగా రావడంతో ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పది కిలోల మంచి రంగు కలిగిన బెల్లానికి 480 రూపాయల వరకు ధర పలికింది. నాసిరకం నలుపు రంగు బెల్లానికి సైతం 450 రూపాయలు పైబడే ధర లభిస్తోంది. నిరుడుతో పోల్చితే ఈ ఏడాది బెల్లానికి రెట్టింపు ధరలు పలుకుతున్నాయ. మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ బెల్లం లేకపోవడంతోనూ ధరలు పెరుగుతున్నాయ. తెగుళ్లు, పెరిగిన సాగు ఖర్చులతోపాటు ధరలు సైతం పడిపోవడంతో గడచిన రెండు, మూడేళ్లుగా చెరకు సాగుచేసే రైతులు తీవ్ర నష్టాలు చవిచూసారు. కాయకష్టం మాట ఎలావున్నా పెట్టుబడులు సైతం దక్కకపోవడంతో చాలామంది సన్న, చిన్నకారు రైతులు చెరకు సాగుకు స్వస్తి చెప్పి ఇతరత్రా కంపెనీల్లోను, పనికి ఆహర పథకం పనులకు కూలీలుగా తరలిపోయారు. దీంతో సాగుచేసేవారు లేక అనకాపల్లి, మునగపాక, కశింకోట తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంట భూములు సైతం బీడు భూములుగా మారిపోయాయి. చాలామంది రైతులు చెరకుకు ప్రత్యామ్నాయంగా సరుగుడు, సుబాబుల్ తదితర దీర్ఘకాలిక పంటలను సాగు చేయడం మొదలు పెట్టారు. ఫలితంగా ప్రస్తుత చెరకు రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. గడచిన మూడు నెలల కాలంగా బెల్లానికి రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. మరోవైపు తాజా సానుకూలతల మధ్య చెరకు సాగుపట్ల మొహం చాటేసిన రైతులు తిరిగి ఈ పంట సాగుకు ఆసక్తి కనబరిచే పరిస్థితులు వస్తున్నాయ. బెల్లానికి అనూహ్యంగా ధరలు పలుకుతుండటంతో వరి ఇతరత్రా పంటల సాగుకోసం సిద్ధం చేసిన భూమిలో తిరిగి చెరకు సాగు చేసేందుకూ రైతులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందుకు అవసరమైన విత్తనం దొరకక నానా అగచాట్లు పడుతున్నారు. మరోవైపు గతంలో 2,500 రూపాయలు పలికే టన్ను చెరకు విత్తనం ధర నాలుగు వేల రూపాయలకు పైబడే పలుకుతోంది. అంత పెద్దమొత్తంలో ధర చెల్లించినా చెరకు విత్తనం దొరకని పరిస్థితి ఏర్పడింది. వాతావరణం అనుకూలిస్తే గత రెండు సీజన్లుగా తగ్గిన చెరకు విస్తీర్ణం ఈ ఏడాది పెరగడంతోపాటు దిగుబడులు కూడా బాగా పెరగవచ్చునని రైతులు భావిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనకాపల్లి మార్కెట్‌కు రోజుకు 1,500 నుండి 2 వేల దిమ్మల వరకు బెల్లం వస్తోంది. ఈ నెలాఖరుతో బెల్లం తయారీ సీజన్ ముగియనుండగా, ఈ మార్కెట్ నుండి ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలతోపాటు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బెల్లం తరలిపోతోంది.