ఎల్జీ పాలిమర్స్ లో చంద్రబాబు పాపమెంత
విశాఖపట్టణం, మే 11
విశాఖలో చాలాకాలంగా ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం పనిచేస్తోంది. 1961న ఈ సంస్థ ఏర్పాటు అయింది. ఇప్పటికి అరవై ఏళ్ళుగా అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ కర్మాగారం స్థాపించినపుడు విశాఖ చాలా చిన్న నగరంగా ఉండేది. దాంతో ఆవాసాలకు దూరంగానే ఈ కర్మాగారం అప్పట్లోనే ఏర్పాటుచేశారు. అయితే కాలక్రమంలో విశాఖ మహానగరంగా విస్తరించడంతో ఏ పాలిమార్స్ కర్మాగారానికి చేరువగా ప్రజల నివాసాలు చోటు చేసుకోవాడం, కొత్త గ్రామాలు రావడం జరిగిపోయాయి. అయితే ప్రమాదకరమైన రసాయనాల కర్మాగారాలు జనవాసాలకు దూరంగా ఉండాలన్నపుడు జనాలను, అక్కడి ఆవాసాలను వాటికి దూరంగానైనా ఉంచాలి. లేకపోతే పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని కర్మాగారాన్ని సదూరంగా తరలించాలి. కానీ ఇవేమీ జరగలేదు.ఇదిలా ఉండగా 2018లో ఇదే కర్మాగారానికి 400 టన్నుల ఉత్పత్తి నుంచి 600 టన్నుల ఉత్పత్తికి పెంచుకోవాలని అధికారిక అనుమతులు ఇచ్చారని చెబుతున్నారు. మరి అపుడు చూస్తే అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఏ విధమైన కొలమానాలు, ప్రమాణాలు పాటించి అనుమతులు ఆనాడు ఇచ్చారన్నది కూడా మేధావుల ప్రశ్నగా ఉందిపుడు. ఇక ఈ కర్మాగారం జనవాసాలలో ఉన్న సంగతిని ఇపుడే కొత్తగా తెలుసుకున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. చంద్రబాబు అయిదేళ్ళు ఏపీ సీఎం గా ఉన్నారు. అంతకు ముందు ఉమ్మడి ఏపీకి సీఎం గా దాదాపు తొమ్మిదేళ్ళు పనిచేశారు.చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉండగానే విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న హెచ్ పీ సీ ఎల్ లో 1997 సెప్టెంబర్లో భారీ అగ్నిప్రమాదం జరిగి గ్యాస్ ట్యాంకర్లు పేలిపోయాయి. అప్పట్లో ఏకంగా అరవై మంది వరకూ చనిపోయారు. మరి ఆ తరువాత అయినా చంద్రబాబు సర్కార్ ఈ ప్రమాదాలపైన దృష్టి పెట్టినట్లుగా కనిపించడంలేదని విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. మరి చంద్రబాబు నాడేం చేశారు, ఇపుడే ఆయనకు ఈ సంగతి తెలిసిందా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. హైదారాబాద్ లో కూర్చుని నిందలు వేస్తున్న చంద్రబాబు తాను సీఎంగా ఉన్నపుడు ఈ కర్మాగారాన్ని ఎందుకు తరలించలేకపోయారో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు కనీసం ఏడాది కూడా అవని జగన్ సర్కార్ దే మొత్తం పాపం అన్నట్లుగా చిత్రీకరించడాన్ని వైసీపీ నేతలే కాదు, ప్రజా సంస్థలు కూడా తప్పు పడుతున్నాయి.చంద్రబాబు సర్కార్ తో పాటు, గతంలో ప్రభుత్వాలకు ఈ కర్మాగారాల ప్రమాదాల గురించి గతంలోనే అనేకసార్లు ఫిర్యాదు చేశామని విశాఖకు చెందిన మేధావులు, నిపుణులు ఇపుడు చెబుతున్నారు. ఇక గతంలో విన్నపాలు వచ్చినా స్పందించని పసుపు పార్టీ నేతలు ఇపుడు తగుదునమ్మా అని బురద జల్లేందుకు తయారు అయిపోతున్నాయని వైసీపీ నేతలు అంటున్న దాంట్లో కూడా నిజం ఉంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఈ పాపంలో అందరూ భాగస్వాములు కావాలని మరోవైపు నిపుణులు అంటున్నారు. అందువల్ల ఎవరిని ఎవరూ తప్పు పట్టుకుని రాజకీయాలు చేయకుండా విశాఖను ప్రమాదాల ముప్పు నుంచి గట్టెక్కించడానికి ఒక్కటిగా నిలిచి తగిన కార్యాచరణకు
సిధ్ధ పడాలి.