భార్య, భర్తల స్నాచింగ్స్
న్యూఢిల్లీ, మే 11,
బాలీవుడ్ హిట్ మూవీ బంటీ అండ్ బబ్లీ సినిమా గుర్తుందా. అందులో హీరో హీరోయిన్లు కలిసి జనాన్ని బురిడి కొట్టిస్తూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతారు. ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకున్నారో మరో కారణమో కానీ ఓ జంట అచ్చం అదే తరహాలో ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడింది. చివరికి వారి పాపం పండింది. అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. భర్త బండి నడిపితే, భార్య ఫోన్లు కొట్టేస్తుంది: ఢిల్లీ పోలీసులు దొంగ జంటను అరెస్ట్ చేశారు. ఫోన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న భార్య, భర్తను అదుపులోకి తీసుకున్నారు. భర్త స్కూటీని నడిపితే, భార్య ఫోన్లు కొట్టేస్తుంది. ఇద్దరూ తెల్లని స్కూటీపై వెళ్తూ ఈ చోరీలకు పాల్పడుతున్నారు. స్నాచింగ్ గురించి వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. దొంగలను గుర్తించి పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. విచారణలో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి.ఓ స్కూటీపై ఇద్దరు వ్యక్తులు వస్తారు. ముందు పురుషుడు ఉంటాడు. వెనుక స్త్రీ ఉంటుంది. స్నాచింగ్ చేసేది మహిళ అని తెలుసుకుని పోలీసులు విస్తుపోయారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. చోరీ జరిగిన ప్రదేశాల్లో సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి పరిశీలించారు. ఒక సీసీ కెమెరాలో నిందితుల దృశ్యాలు కనిపించాయి. అయితే అందులో క్లారిటీ లేదు. వారి ముఖాలు స్పష్టంగా లేవు. అయితే ఆ ఫుటేజీ వారికి ఓ క్లూ ఇచ్చింది. ఆ ఇద్దరి భౌతిక రూపం గురించి తెలిసింది. దాని ఆధారంగా పోలీసులు వేట మొదలుపెట్టారు. పహర్ గంజ్ కి చెందిన జంట స్నాచింగ్ కు పాల్పడుతోందని విచారణలో పోలీసులకు తెలిసింది. ఆ దిశగా వేట ముమ్మరం చేశారు. చివరికి పోలీసుల శ్రమ ఫలించింది. ఫోన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న దొంగ జంట దొరికింది. కిషన్ గంజ్ లోని రైల్వే కాలనీలో భార్య, భర్తను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు, చోరీ చేసిన ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.ఆ వ్యక్తి పేరు అర్జున్ అలియాస్ కరణ్. పహర్ గంజ్ నివాసి. ఆమె పేరు వైశాలి కౌశల్. ఇద్దరూ భార్య భర్తలు. అర్జున్ కు నేర చరిత్ర ఉంది. 31 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మాదకద్రవ్యాలకు బానిస. మూడు నెలల క్రితమే అతడు కరోల్ బాగి నివాసి అయిన వైశాలిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె టాటూ ఆర్టిస్ట్, మాదకద్రవ్యాల బానిస కూడా. డ్రగ్స్ కొనేందుకు అవసరమైన డబ్బు కసం ఇద్దరూ కలిసి చోరీలకు పాల్పడుతున్నారు. ముందుగా రఘుబీర్ నగర్ నుంచి ఓ స్కూటీని దొంగిలించారు. ఆ తర్వాత చైన్ స్నాచింగ్ లు మొదలుపెట్టారు. అర్జున్ స్కూటీ నడుపుతాడు. వైశాలీ స్నాచింగ్ చేస్తుంది. మొబైల్ ఫోన్లు లాక్కుంటుంది. మొత్తంగా ఈ దంపతుల పాపం పండింది. ఇద్దరూ అత్తారింటికి చేరుకున్నారు.