ఆరోగ్యం క్షీణించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని వైద్యులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఎంపీ మేకపాటి నిన్నటి నుంచి అస‍్వస్థతకు గురైనా ఆయన తన దీక్ష కొనసాగిస్తూనే వచ్చారు. ఇవాళ ఉదయం ఆయనకు తీవ్రమైన తలనొప్పి, హై బీపీతో బాధపడ్డారు. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితం మేకపాటి వాంతులు చేసుకున్నారు. దీంతో ఏపీ భవన్ ప్రాథమిక వైద్యులు ...ఎంపీ మేకపాటికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయనను ఆస్పత్రికి తరలించాల్సిందిగా సూచించారు. దీంతో ఎంపీ మేకపాటిని చికిత్స నిమిత్తం రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈ దీక్షకు ఢిల్లీలోని తెలుగు సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. మరోవైపు వైసీపీ ఎంపీల దీక్షకు సీపీఎం కూడా మద్దతు పలికింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షా శిబిరానికి వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఎంపీలతో పాటు దీక్షలో కూర్చున్నారు, రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు వస్తాయనే విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని తెలిపారు. విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు కాదు, పదేళ్ల పాటు ప్రత్యేక హదా ఇస్తామని ప్రకటించారని... కానీ, ఆ హామీని బీజేపీ నెరవేర్చలేకపోయిందని చెప్పారు. వైసీపీ ఆందోళనతో రాష్ట్రంలో ఉత్సాహం పెరిగిందని, రాష్ట్ర మేలు కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు సీపీఎం మద్దతిస్తుందని వెల్లడించారు. విభజన హామీలపై పార్లమెంట్ లో చర్చించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే కేంద్రం నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదన్నారు.