భైంసాలో మళ్లీ ఉద్రిక్తత
అదిలాబాద్, మే 11
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ప్రార్థనా మందిరంలో భౌతిక దూరం పాటించడం లేదని మరో వర్గానికి చెందిన వారు నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో ఒకరికి గాయాలు కాగా.. కారు అద్దాల ధ్వంసం కావడంతోపాటు ఒక బైక్‌ను దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో 24 గంటలపాటు కర్ఫ్యూ విధించారు. నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు, కరీంనగర్ డీఐజీ ప్రమోద్ కుమార్ భైంసా చేరుకుని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.ఈ ఏడాది ఆరంభంలో భైంసా పట్టణంలోని కొర్బా వీధిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ వర్గానికి చెందిన వారు.. మరో వర్గీయులుపై రాళ్లతో దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో చాలా రోజులపాటు భైంసాలో 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు.. ఇరు వర్గాలకు చెందిన 70 మందిని అరెస్ట్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్, మొబెల్ సేవలపై ఆంక్షలు విధించారు.