YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

కరోనా పురుషులకే డేంజర్

కరోనా పురుషులకే డేంజర్

కరోనా పురుషులకే డేంజర్
న్యూఢిల్లీ, మే 11,
ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు, మరణాల్లో ఎక్కువుగా పురుషులే ఉన్నారు. దీనికి గల కారణాలపై ఇప్పటి వరకూ శాస్త్రీయ ఆధారాలు లేవు. తాజాగా దీనిపై ఓ అధ్యయనం వెల్లడించింది.మహిళల కంటే పురుషులే ఎక్కువగా కరోనా వైరస్ బారినపడుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడయ్యింది. దేశంలో నమోదయిన కేసుల్లో మహిళల కంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. పురుషులు ఎక్కువ సంఖ్యలో వైరస్ బారినపడటానికి గల కారణాలపై నెదర్లాండ్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టి.. ఫలితాలను వెల్లడించారు. కొవిడ్‌-19 కారక ‘సార్స్‌-కొవ్‌-2’ వైరస్‌ ‘యాంజియోటెన్సిన్‌-కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2’ (ఏసీఈ2) అనే ఎంజైమ్‌ సాయంతో కణాల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. కణాల ఉపరితలంపై ఉండి కరోనా వైరస్‌ లోపలికి ప్రవేశించేందుకు ఈ ఎంజైమ్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నట్లు యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్ ‌(యూఎంసీ) చేపట్టిన పరిశోధనలో తేలింది.ఈ ఎంజైమ్‌ మహిళల కంటే పురుషుల రక్తంలో అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించినట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఆడ్రియాన్‌ వూర్స్‌ వివరించారు. దీని వల్లే కరోనా వైరస్‌ ప్రభావం మగవారిలో అధికంగా ఉన్నట్లు విశ్లేషించారు. వాస్తవానికి ఈ పరిశోధనను కరోనా వైరస్‌ వెలుగులోకి రావడానికి ముందే ప్రారంభించామని ఆయన తెలిపారు. హృద్రోగ సమస్యలపై అధ్యయనం చేస్తుండగా.. ఏసీఈ2 పురుషుల్లో అధికంగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. తాజాగా కరోనా వైరస్ బాధితుల్లో పురుషులే అధికంగా ఉండడంతో ఈ కోణంలోనూ అధ్యయనం నిర్వహించి ఏసీఈ2 వల్లే ఇలా జరుగుతుందని గుర్తించామన్నారు.గతంలో ఇదే అంశంపై పరిశోధన జరిపిన ఫలితాలతోనూ తమ ఫలితాలు సరిపోలాయన్నారు. ఈ నేపథ్యంలో గుండెకు రక్తప్రసరణ నిలిచిపోవడం, డయాబెటిస్‌, కిడ్నీ సంబంధిత వ్యాధిలో ఏసీఈ సాంధ్రతను నియంత్రించడానికి వాడే ఏసీఈ ఇన్‌హిబిటర్స్‌ లేదా యాంజియోటెన్సిన్‌ రిసెప్టార్‌ బ్లాకర్స్‌ (ఏఆర్‌బీ)ను కోవిడ్‌-19 బాధితులకు ఇవ్వొచ్చని, తద్వారా వైరస్‌ ప్రభావాన్ని తగ్గించొచ్చని అంచనా వేశారు. ఈ ఫలితాలను యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించారు.ఏసీఈ2 ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలలోనూ వీటికంటే వృషణాల్లో అధికంగా ఉంటుందని ప్రొఫెసర్ వూర్స్‌ తెలిపారు. దీనివల్లే ఈ ఎంజైమ్‌ పురుషుల్లో అధికంగా ఉందని.. తద్వారా కరోనా వైరస్‌ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడానికి కారణమవుతోందని విశ్లేషించారు. వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి కూడా ఈ ఎంజైమే దోహదపడుతోందని అంచనా వేశారు. అందుకే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అయితే, ఈ అంశంపై ఇంకా లోతైన పరిశోధన జరిపి ధ్రువీకరించాల్సిన అవసరం ఉందన్నారు. తమ అధ్యయనంలో దాదాపు వేలాది మంది పురుషులు, మహిళలను విశ్లేషించామని, 11 ఐరోపా దేశాల్లో గుండెపోటుకు గురయిన 3,500 మంది నుంచి నమూనాలను సేకరించినట్టు తెలిపారు.మహిళల కంటే పురుషులలో బలమైన బయోమార్కర్లలో ఒకటైన ఏసీఈ2 చాలా ఎక్కువగా ఉందని, కరోనా బారినపడ్డవారిలో మహిళల కంటే పురుషులే చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని తాము గ్రహించినట్టు ఈ పరిశోధనలో పాల్గొన్న మరో వ్యక్తి డాక్టర్ ఐజాయా సామా అన్నారు

Related Posts