YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలోనే ఆగస్టు 15

విశాఖలోనే ఆగస్టు 15

విశాఖలోనే ఆగస్టు 15
విశాఖపట్టణం, మే 11
ఆగస్టు నెలకు దేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన నెల అది. పైగా ఏడాదిలో రెండవ ప్రధమార్ధం కాబట్టి ప్లానింగ్ కి కూడా శుభం అనుకుంటారు. ఇక రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్ ముహూర్తాల మీద అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా ఆధారపడుతున్నారు. శ్రావణమాసం అంటే మంచిదని చెబుతారు. అది ఆగస్ట్ నెలలోనే వస్తుంది. దాంతో జగన్ పాలనారాజధాని విశాఖకు మార్చేందుకు ఈ కొత్త ముహూర్తాన్ని ఎంచుకుంటున్నారని గట్టిగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా తెర వెనక చురుకుగా సాగుతోందని అంటున్నారు.కరోనా మహమ్మారి ఇపుడు దేశవ్యాప్తంగా ఉంది. అది అదుపులోకి వచ్చేందుకు కచ్చితంగా రెండు నెలలు పడుతుందని అంటున్నారు. అందుకే జగన్ జూలై నుంచే తన యాక్షన్ ప్లాన్ కి పదును పెడుతున్నారు. జూలై నెలలో వైఎస్సార్ జయంతి సందర్భంగా పేదలకు పాతిక లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఏపీవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి పెండింగ్ బిల్లులను ఆమోదిస్తారని అంటున్నారు. అప్పటికి పార్లమెంట్ కూడా మొదలైతే శాసనమండలి రద్దు బిల్లు అక్కడ ఆమోదం పొందేలా చూస్తారట. మొత్తానికి మండలి రద్దు అయినా కాకపోయినా అధికార వికేంద్రీకరణ బిల్లును మాత్రం ఆమోదించుకుంటారని అంటున్నారు.కరోనా వల్ల అన్ని కాలండర్లూ మారిపోతున్నాయి. ఇప్పటికే ఆర్ధిక సంవత్సరం మరో మూడు నెలలు ముందుకు వెళ్ళిపోయింది. ఇక కొత్త విద్యాసంవత్సవం క్యాలండర్ ని కూడా కేంద్ర స్థాయిలో సెప్టెంబర్ నుంచి మొదలయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు దానికి కాస్తా అటు ఇటుగా ఏపీ అకడమిక్ క్యాలండర్ తయారుచేస్తారని అంటున్నారు. అంటే ఈసారి కొత్త విద్యా సంవత్సరం ఎప్పటిలాగా జూన్ లో మొదలు కాదు, దాంతో రెండు నుంచి మూడు నెలల సమయం ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సచివాలయాన్ని విశాఖకు తరలిస్తే బాగుంటుందని జగన్ సర్కార్ ఆలోచన చేస్తోందిట. దాని వల్ల ఉద్యోగుల బదిలీలకు ఎటువంటి ఇబ్బందులు రావు అని భావిస్తోందిట.ఇక జగన్ సీఎం గా ప్రమాణం చేసిన తొలి ఏడాదే విశాఖలో ఆగస్ట్ 15 నిర్వహించాలనుకున్నారు. అయితే కుదరలేదు. ఆ తరువాత రిపబ్లిక్ డే కి అయినా విశాఖ రావాలనుకున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేశారు. చివరి నిముషంలో అది రద్దు అయింది. ఇపుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విశాఖలో జగన్ ఆగస్ట్ 15 నాడు జండా ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. మరి ఆ ధీమాకు గల కారణాలు ఏంటో చూడాలి. అలాగే జగన్ కోరుకుంటున్నట్లుగా 2020లోనే విశాఖకు వచ్చి పాలన కనుక ప్రారంభిస్తే ఆయనే అసలైన విజేత అవడం ఖాయమని అంటున్నారు.

Related Posts