బాధితులకు అండగా ఉన్న నేతలపై అక్రమ కేసులు: చంద్రబాబు
అమరావతి మే 11
వీడియో కాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్యాస్‌లీక్ బాధితులకు అండగా ఉన్న నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, టీడీపీ నేతల పెట్టిన అక్రమ కేసులు తక్షణం ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రూ.కోటి వద్దు..తన కూతురే కావాలన్న తల్లిపై కేసు పెట్టారని తప్పుబట్టారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేదలపై భారం మోపొద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు. విద్యుత్‌చార్జీలను పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. సమస్యలు సృష్టించడమే వైసీపీ శ్రేణులు పని అని మండిపడ్డారు.హిందుస్తాన్ పాలిమర్స్‌కు టీడీపీ ప్రభుత్వం భూములు ఇవ్వలేదని తెలిపారు. 1964లో హిందుస్తాన్ పాలిమర్స్‌కు 213 ఎకరాలు కేటాయించారని గుర్తుచేశారు. 1992లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మినహాయింపులు ఇచ్చారని తెలిపారు. హైకోర్టు సూచనల మేరకే టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, స్టైరిన్ ఉత్పత్తికి టీడీపీ ప్రభుత్వం అనుమతిచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలోనే పాలిస్టైరీన్ ఉత్పత్తులకు అనుమతులిచ్చారని తెలిపారు. వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేయటం తగదని, విష వాయువు తీవ్రతతో పంటలన్నీ మాడిమసైయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.