YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మితిమీరతున్న విమర్శలు...

మితిమీరతున్న విమర్శలు...

మితిమీరతున్న విమర్శలు...
ఏలూరు, మే 12
అధికారంలో ఉన్నపుడు వందిమాగధుల భజన రంజుగా ఉంటుంది. ఎటూ పవర్ చేతిలో ఉంటుంది కాబట్టి భుజకీర్తులు ఎన్ని తగిలించినా అందంగానే ఉంటుంది. కానీ ఒకసారి ప్రతిపక్షంలోకి వచ్చాక మాత్రం సూక్తి ముక్తావళి చెబుతూ కూర్చుంటే కధ ముందుకుసాగదు. కానీ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు, చెల్లెళ్ళు మాత్రం అదే విధానం అలవాటు చేసుకున్నారు. అధినేత చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేయడానికి ఇదే దగ్గర దారి అని వారు ఇంకా అనుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఇలాంటి వాటికే మార్కులు వేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీలో పనిమంతులకు పెద్ద పీట వేయడం చాలా తక్కువ అంటారు. అందుకే ఈ కొలమానాన్ని తీసుకునే తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు.ఆత్మ స్తుతి, పరనింద ఇది అధినేత చంద్రబాబుకు అలావాటు అంటారు. తన హయాం గొప్పది, మిగిలిన వారు ఏం చేసినా తిట్టిపోయాల్సిందే. మరి ఆ చెట్టు కొమ్మలు, ఆ అధినేత తమ్ముళ్ళు కూడా అదే రూట్లో వెళ్తున్నారు. మా నాయకుడు గొప్పవాడు, వీరుడు, శూరుడు, నాలుగు దశాబ్దాలు అనుభవం కలిగిన వాడు అంటూ ఓ వైపు కితాబులు ఇస్తున్నారు. మరో వైపు చూస్తే జగన్ సర్కార్ మీద ఉన్నవీ, లేనివీ చేరుస్తూ విమర్శలు చేస్తున్నారు. ఒక్కోసారి హద్దులు మరచిపోతున్నారు. ఆ విమర్శలు బూమరాంగ్ అవుతున్నా కూడా పట్టించుకోవడంలేదు.జగన్ని తుగ్లక్ అన్నది ఇదే టీడీపీ, ఇపుడు ఆ పార్టీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పది మంది తుగ్లక్ లు కలిపితే ఒక్క జగన్ అంటున్నారు. నిజంగా ఇది పార్టీకి ఏ మాత్రం మైలేజ్ తెచ్చే విమర్శ కాదు. ముఖ్యమంత్రి సీట్లో ఉన్న నేతను అనాల్సిన మాట అంతకంటే కాదు, హుందాగా విమర్శలు ఉండాలి. పైగా అవి నిర్మాణాత్మకంగా ఉండాలి. అన్నింటికి మించి జనం మెచ్చేలా ఉండాలి. కానీ టీడీపీ నేతలు తమకు పార్టీలో పోటీ పెట్టారా అన్నట్లుగా ఒకరిని మించి ఒకరు తెల్లారిలేస్తే జగన్ మీద తిట్ల పురాణం అందుకుంటున్నారు. ఏపీ టీడీపీ అధినేత కళా వెంకటరావు అయితే జగన్ ఒక్క హామీ నేరవేర్చలేదని, నవ రత్నాలూ నవమోసాలు అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విధంగా అసంబద్ధమైన విమర్శలతో పొలిటికల్ మైలేజ్ వస్తుందని తమ్ముళ్ళు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావడంలేదు.చంద్రబాబు సైతం తమ్ముళ్ళు స్థాయి మరచి చేస్తున్న విమర్శలకే మార్కులు వేస్తే అసలుకే ప్రమాదం అంటున్నారు. పార్టీ ఇపుడు ప్రతిపక్షంలో ఉంది. గడప దిగి జనంలోకి పోవాలి. పార్టీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పి పోయిన అభిమానాన్ని తిరిగి సంపాదించుకోవాలి. కానీ గుమ్మం దిగకుండా ఇంట్లో కూర్చుని ఎదుటి పక్షంపైన బురద జల్లితే పని అయిపోతుందని భావిస్తే టీడీపీకే ముప్పు అని గ్రహించాలి. చంద్రబాబు ఇలాంటి అనవసర వాచాలత్వాన్ని ప్రోత్సహించకుండా ఉంటే మంచిది. నేతల పనితీరుపైన కొలమానాన్ని, తూకాలను చంద్రబాబు మార్చుకోవాలి. పార్టీ పరుగులు తీయాలంటే మాటలకు స్వస్తి చెప్పి చేతలకు దిగే నేతలక పెద్ద పీట వేయాలి. ఇది టీడీపీలోనే వినిపిస్తున్న మాట

Related Posts