కూరల మార్కెట్ లో హాట్ స్పాట్
హైద్రాబాద్, మే 12,
హైద్రాబాద్ నగరంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్లలో ఒకటైన గుడిమల్కాపూర్ మార్కెట్ కరోనా హాట్‌స్పాట్‌గా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన ఓ వ్యక్తికి గత వారం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఆ మరునాడే గుడిమల్కాపూర్‌లో మరో 3 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో అధికారులు హడావిడిగా మూడు రోజుల పాటు మార్కెట్‌ను మూసివేశారు. శానిటైజేషన్ చేసిన అనంతరం శనివారం మార్కెట్‌ను మళ్లీ తెరిచారు. మాస్కు లేనిదే మార్కెట్‌లోకి అనుమతించేది లేదంటూ నిబంధనలు విధించారు. అయితే మార్కెట్‌లోని వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, కూరగాయలు కొనేందుకు వచ్చే చిల్లర వ్యాపారులు మాస్కులు లేకుండానే మార్కెట్‌లోకి వస్తున్నారు. కూరగాయలు, ఉల్లిగడ్డలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను తెచ్చే ట్రక్కులు, డీసీఎంలు, ఆటోట్రాలీల వారు కూడా మాస్కులు లేకుండానే రాకపోకలు సాగిస్తున్నారు.మార్కెట్ కమిటీ సిబ్బంది సైతం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ మార్కెట్ ఒకటి. మార్కెట్‌లో నిబంధనలు పాటించక పోవడం వలన కరోనా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. నగర శివారు ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలను రాత్రివేళల్లో తెస్తారు. ఆకు కూరలతో పాటు ఇతర కూరగాయలను కొనేందుకు చిల్లర వ్యాపారులు తెల్లవారుజాము 3 గంటల నుంచే పెద్ద ఎత్తున తరలి వస్తారు. వేల సంఖ్యలో రైతులు, కమీషన్ ఏజెంట్లు, డ్రైవర్లు, చిల్లర వ్యాపారులు ఉన్న సమయంలో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. మార్కెట్ యార్డులోనే ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది సైతం మాస్కుల్లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ప్రజలకే కానీ తమకు వర్తించన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులతో మార్కెట్ కమిటీలో జరుగుతున్న ఉల్లంఘనలపై విచారణ చేపట్టి బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్న పాలకమండలి, కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.