చైనా ఈక్విటీస్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకున్న అమెరికా
వాషింగ్టన్ మే 12
అగ్రరాజ్యాలు అమెరికా, చైనా దేశాల మధ్య దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న ట్రేడ్‌వార్ పతాకస్థాయికి చేరుకుంది. కొవిడ్-19 సంక్షోభంపై రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా డ్రాగన్ దేశానికి మరో షాక్ ఇచ్చారు. చైనా ఈక్విటీస్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఫాక్స్ బిజినెస్ పేర్కొంది. యూఎస్ ఫెడరల్ రిటైర్‌మెంట్ ఫండ్స్‌ను వెనక్కి తీసుకోవాలని లేబర్ సెక్రటరీ యూజీన్ స్కాలియాకి ట్రంప్ సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఫెడరల్ ఉద్యోగుల పదవీ విరమణ నిధి ‘థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్’ సొమ్మును చైనా ఈక్విటీస్‌లో పెట్టుబడులుగా పెట్టరాదని శ్వేత సౌధం నిర్ణయించినట్టు లేబర్ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొంది. చైనా స్టాక్ మార్కెట్‌లో యూఎస్ ఫెడరల్ రిటైర్‌మెంట్ ఫండ్స్ విలువ 4.5 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.ప్రాణాంతక మహమ్మారి నోవెల్ కరోనా వైరస్ చైనా సృష్టేనంటూ ఇప్పటికే ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా తమ దేశం తీవ్రంగా నష్టపోయిందనీ.. చైనా ఎగుమతులపై అదనపు సుంకాలను రాబట్టడం ద్వారా ఆ నష్టాన్ని రాబడతామని ట్రంప్ చెబుతున్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై తమకు ఆసక్తి లేదనీ.. ఆ దేశంతో దీనిపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని కూడా ఆయన ఇవాళ తేల్చిచెప్పారు.