స్వదేశానికి వచ్చేందుకు అడ్డంకిగా మారిన కేంద్రం ఆంక్షలు
న్యూ డిల్లీ మే 12
కరోనా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో అమెరికాలో చిక్కుకుపోయిన ఎన్నారైలకు ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. 'వందే భారత్ మిషన్' ద్వారా ఎన్నారైలను స్వదేశానికి తరలిస్తున్న భారత ప్రభుత్వం.. కొవిడ్ కట్టడి కోసం ఇంతకుముందు ప్రయాణాలపై విధించిన ఆంక్షలే ఇప్పుడు ఎన్నారైలకు అవరోధంగా మారాయి. వీసా ఉన్నా స్వదేశానికి రాలేని పరిస్థితి దాపురించింది. దీనికి కారణం వీసా అవసరం లేకుండా భారతీయులను స్వదేశానికి వచ్చేందుకు అవకాశం కల్పించే 'ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా'(ఓసీఐ) కార్డులపై గత నెలలో నిషేధం విధించడమే. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇదే అమెరికాలో చిక్కుకున్న కొంతమంది భారతీయులకు అడ్డంకిగా మారింది.వీసా, గ్రీన్‌కార్డు ఉన్నవారి పిల్లలు అక్కడే పుట్టడంతో వారందరూ ఓసీఐ పరిధిలోకి వస్తారు. అయితే, పేరెంట్స్ ప్రయాణించేందుకు అక్కడి అధికారులు అంగీకరిస్తున్న... ఓసీఐ పరిధిలోకి వచ్చే పిల్లలను మాత్రం అనుమతించడం లేదు. దీంతో 'వందే భారత్ మిషన్' విమానాలు ఎక్కేందుకు వెళ్తున్న భారతీయ కుటుంబాలకు చేదు అనుభవం ఎదురవుతుంది. కేంద్రం ఓసీఐ కార్డులపై విధించిన నిషేధం కారణంగా పిల్లలను విమానం ఎక్కేందుకు అక్కడి సిబ్బంది ఒప్పుకోవడం లేదు. దీంతో వేరే మార్గం లేక తల్లిదండ్రులు కూడా విమానాశ్రయాల నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నారు. కనుక భారత ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి తమను ఆదుకోవాలని ఎన్నారైలు కోరుతున్నారు.