రాష్ట్రంలో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచాయి. వచ్చే ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పొత్తుల్లేకుండా బరిలోకి దిగుతానని ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలూ మారబోతున్నాయి. నిన్న మొన్నటి వరకు అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ జెండాలు మాత్రమే కన్పించేవి. వచ్చే ఎన్నికలలో మేమూ పోటీ చేస్తామంటూ జనసేన సిద్ధమవుతుండడం.. ఆ పార్టీకి మన జిల్లాలో కొంత కేడర్ ఉండడం వంటి కారణాలతో ఈ సమీకరణలకు అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు వరకు కాంగ్రెస్‌కి సంప్రదాయ ఓటు బ్యాంకుగా నిలబడిన బలమైన సామాజికవర్గం ఇప్పుడు తమకు చేరువవుతోందని వైసీపీ బలంగా విశ్వసిస్తోంది.
గత ఎన్నికలలో టీడీపీకి బాసటగా నిలబడిన రెండు కీలక సామాజిక వర్గాలలో ఒక వర్గం రిజర్వేషన్ల వ్యవహారంపై స్పష్టత లేకపోవడంతో ఈసారి టీడీపీ వైపు ఉంటారా? అన్నది ప్రశ్నార్థకంగా ఉందన్న విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ సామాజిక వర్గంలో మెజార్టీ ఓటర్లు జనసేన వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీలో దెబ్బతిన్న వారికి ఇపుడు జనసేన ద్వారా న్యాయం జరుగుతుందన్న ప్రచారమూ జరుగుతోంది.
జనసేన పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసినా, కమ్యూనిస్టులతో జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగినా ఆ ప్రభావం ఎంత ఉంటుంది? జనసేనకు వచ్చే ఓట్లు వల్ల వైసీపీ, టీడీపీలలో ఎవరికి నష్టం ఎక్కువగా ఉంటుంది? అనేదానిపై రాజకీయ వర్గాలలో.. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ శ్రేణులలో జోరుగా చర్చ సాగుతోంది. జనసేన పాతవాళ్లకు టికెట్లు ఇవ్వకూడదన్న విధానపరమైన నిర్ణయం వల్ల.. పోటీచేసే అభ్యర్థులంతా కొత్తవారే ఉంటారని మరొక వాదన వినిపిస్తోంది. దీంతో అయితే తమకు అవకాశం ఇవ్వకపోతే తమ వారసులకైనా ఇవ్వాలని మాజీలు కొంతమంది ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నారు. సార్వత్రిక సమరానికి ఏడాది సమయం ఉండగానే ఆశావహులు ఇప్పటి నుంచే టికెట్ల వేటలో పడ్డారు. టీడీపీ టిక్కెట్టుకు ప్రయత్నించడం, రాకపోతే వైసీపీ, అదీ లేకపోతే తమ కుమారుడికి జనసేన.. ఇలాంటి ఆలోచనలో ఉన్నారు.. కొంతమంది నేతలు.
యువత, మహిళలు తమ పార్టీ వైపే మొగ్గుతున్నారంటూ జనసేన బలంగా విశ్వసిస్తోంది. జిల్లాలో ముఖ్యంగా బలమైన రెండు సామాజిక వర్గాలలో జనసేనకు మంచి ఆదరణ ఉండబోతోందంటూ ఇప్పటికే విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ రెండు సామాజిక వర్గాలలో టీడీపీ, వైసీపీ పర్సెంటేజీ ఎలా ఉంది? జనసేన చీలికలతో ఎవరికి ఎంత నష్టం? చీలే ఓట్లతో ఎవరికి ప్రయోజనం? వంటి అంశాలలో జోరుగా చర్చ సాగుతోంది.